బుధవారం, జనవరి 18

sankaracharya sookthi

చేయ కుండ ఎవరు చేస్తి ననియు చెప్పొ 
అట్టి వాడె ఇలను అధము డగును 
ఎంత చేసి యున్న కొంతయే అనువాడు 
సజ్జ నుండు అగును జగతియందు 

శనివారం, అక్టోబర్ 18

యువకిరీట

              జరిగి పోయిన దానికి జంక  కుండ
              మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
              పచ్చ దనమును  కాపాడ వచ్చు చున్న
              యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

             కష్టమున  నున్న  నగరాన్ని కనుల జూచి
            ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
            పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            రోడ్డు పొడవున చెట్లన్ని రూట్ల తోనె 
            కూలి పడియున్న దృశ్యాలు  జాలి కొలిపె ;
            యువత రక్తంబు అంతటన్ యురికి వచ్చి 
            చెట్లు తొలగించి ప్రక్కకు నెట్టు చున్న 
                యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            చెట్ల నడుమున నెలకొన్న చెత్త నంత
           యూడ్చి పెట్టియు ఒకప్రక్క కొ త్తి పెట్టి
           బాట లన్నియు పరిశుభ్ర  పరచు నట్టి
           యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

          జన్మ భూమికి యువకులు  సాయ మొసగ ,
          పచ్చ దనమున  వైజాగు పరవశించి
          పూర్వ వైభవ శోభను పొంద గలదు
          కాంతి వెలుగులు నగరాన కాన గలము !
             యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

         ఊడ్చి పెట్టియు వదలిన ఉత్తరాంద్ర
        తిరిగి తొలిరూపు పొందగా తీర్చి దిద్ద
        చంద్ర బాబుకు ఒకనికే సాధ్య పడదు
        జనుల సహకార ముంటేనె  సాధ్య మగును
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !










గురువారం, అక్టోబర్ 16

నీచ రాజకీయాలు


ప్రకృతి విధ్వంసానికి
నికృష్టపు రాజకీయ నిందలు తగునా?
అక్కడ ఎవరో ఓడితె
అక్కసుగా యూరి ప్రజల ననుటను సబుబా?

నోటికి వచ్చిన కూతలు
మాటాడక యుంట మీకు మంచిది సుమ్మీ!
ఓటమి చూస్తిరి గానీ
మాటలలో మీకు నింక మార్పే రాదా?

చేయు చున్నపనికి చేయూత నీయక
దె ప్ప డమ్ము మీకు తప్పుకాద?
విసుగు చెంద కుండ విశ్రాంతి లేకుండ
పనిని చేయు చుండె ,ప్రభుత ,నేడు .
అట్టి వారిపై నిందలు అభిమతంబ?

కార్యములయందు లోపాలు కాన వచ్చు
అవియు సహజము ,సహనమ్ము అవుసరమ్ము
బొత్స,రఘువీర,జగనులు బుద్ది వరులు
తెలుసు కొనివారు  ,విజ్ఞతన్ మెలగ వలయు

మంగళవారం, అక్టోబర్ 14

విజయ తాండాన ప్రకృతే విస్తు పోయె

       "హ్రుద్దు " పేరున కాలాగ్ని హుంకరించ
         సుందరంబైన "వైజాగు" శోభ పోయె ;
         గాలి ధాటికి చెట్లన్ని నేల కూలె  ,
         ప్రళయ ఘోషతొ  ప్రజలంత వణికి పోయె !
              దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 1.

       "హృద్దు " విలయంబు ధాటికి దద్ద రిల్లి ,
       ఇండ్ల కప్పులు , గుడిసెలు నెగెరె నకట ,
       వేల ఎకరాల పంటలు నేల  కొరిగె ,
       జీవ నోపాధి కోల్పోయె , జీవకోటి !
             దృశ్యములు చూడ మనసున దిగులు చెందె ..... 2.

       విద్యుదుత్పత్తి యంతటన్  వెసలి పడగ ,
       అంధకారాన నగరమ్ము అలమ టించె !
       నీళ్ళు రాకను, కాఫీకి ,పాలు లేక,
       బాధ చెందారు వైజాగు ,బాధితులట !
            దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 3


       పాలు ,నీళ్ళ కొరకు ప్రజలంతా పరుగెట్ట ,
       ధరలు పెంచడమ్ము ధర్మ మగున?
       మాన మత్వ మున్న మనిషిలా వర్తించి ,
       సాటి మనిషి కీవు సాయ పడుమ !
            దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 4.
.

      రాజ కీయు లంత రాజకీయము వీడి ,
      సహక రించ గలరు సాయ మందు,
     లాభ మందె  మీరు లక్ష్యంబు పెట్టక ,
     బీద వారి నెల్ల నాదు  కొనుడు !
             దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.


    ఓదార్పు చాల దిప్పుడు 
    ఏదో నొక సేవ నీవు నెంచుకు  చేయన్ !
   మోదము నొందును హృదయము 
   ఆ దేముడె , నిన్ను మెచ్చి ,అభినందించున్ !
                దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.


   ఇక మా యింటి కొచ్చిన ముప్పు!

    కిటికి  అద్దాలు ముక్కలై  క్రింద పడెను ,
    ఇంటి "అంటినా " ఎచటికో ఎగిరి పోయె ,
    ఇంటి ముందున్న గేటుయూ ,యిరిగి పడియె ,
    పనిని చేయంగ వర్కర్లు వినుట  లేదు .. 

     వినుట  లేదని నేనెట్లు వివరణిద్దు ?
     వారి కుండిన పనులే వొ ? వారి కుండు ,
     చిన్న పనులివి వారెట్లు చేయ గలరు ?
    చేసు కోవచ్చు ,తాపీగ , చేయ గలము. 

           నగర ముప్పున మా ముప్పు తగదు పోల్చ !









మంగళవారం, అక్టోబర్ 7

మారుషిస్ లోని అందాలు మరువ తగున?

        గంగ తలమను ప్రాంతమ్ము కలదిచంట 
        ఆకశంబంటు ఈశ్వరు నటను  గాంచ 
        కళ్ళు చెదురును ,పులకించు వళ్ళు గూడ ,
        ఈశ్వరభిషేఖముల్ రోజు నిచట జరుగు. 
                 మారుషిస్ దీవి  అందాలు మరువ తగున? 

        గుడికి దగ్గర్లొ  మరియొక కోవెలొప్పె ,
        అందు ,శివలింగముల్ యెన్నొ ? అలరి యుండె ,
        చూడ డానికి అదియెంతొ, సొంపు  గొలిపి 
        కాశి క్షేత్రంబు మనకట కానిపించు 
                   మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

        బాల కృష్ణుని ప్రీతి  గోశాల యొకటి
        దాని కెదురుగ మనలకు కాను పించు ;
        ఆవు దూడల తో పుష్టి  గోవులచట 
        వాని కాహార మందించు భక్తి వరులు . 
                    మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

        గంగ తలనుండి మరికాస్త కదలి  వెళ్ళ ,
        సహజ సౌందర్య ప్రకృతి సంబరాలు ,
        సరసు లందున బాతుల సరసు లాట ,
        పూత కొచ్చిన తేయాకు పొలము లెన్నొ ?
                       మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         తిరుపతిగ యెంచు 'లల్లోర' తీర్ధ మందు 
         వేంకటేశ్వర స్వామి కొవెలయు కలదు. 
         తిరుపతర్చక వర్యులు గురువు లిచట 
         తెలుగు వారంత  కలసెడి  తీర్ధ మిదియె !
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         సాంప్రదాయపు "సేవలు " జరుపుచుండి 
         అన్న ప్రాసాదముల్ తోడ హార తిచ్చు ;
         భక్తి శ్రద్దల నడుమున భక్తులంత 
         వరుస క్రమమును పాటించి ప్రార్ధనిడును !
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         దివ్య తేజస్సు తోయొప్పు ,దేవి యొకటి 
         'షెబలు' యనియెడి  ప్రాంతాన సిరులు గొలుపు 
         తమిళు లందరు నిచటకు  తప్పని సరి 
         "అమ్మ వారిని" దర్శించ నిచటి కొచ్చు!
                       మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         ప్రాంగణము లోని కనిపించు ప్రతిమ లందు  
         తమిళ సంస్కృతి మనలకు  తనరు గలదు ;
         సాంప్రదాయపు ధోవతి, జడయు సిగతొ,
         అమ్మ వారిని కొలెచెద రయ్య వార్లు 
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
                  
          మనసు మెచ్చెడి 'ఇస్కాను'  మందిరమును 
          హర్ష మొందగ జూస్తి , మార్షీ ష్షు నందు ,
          హరి భజనలిట చెవులందు హాయి గొలుప ,
          పార వశ్యాన పులకించు భక్తు లిచట 
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

          ఇక ఆఖరుగా ,ఇట  కానరానివి, విననవి ,చూడనివి :-

                కారు లేగాని  ఆటోలు ,కానరావు 
                వినగ లేదిట కారు హారనుల మ్రోత ,
                రోడ్డు నందున చెత్తలన్  చూడ లేదు ,
                పారి శుద్ధ్యాన  ప్రకృతే పరవశించు !
                         మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
 
 
           
 
                     

          
       
         

మంగళవారం, సెప్టెంబర్ 30

వినుము నా మాట నిజమిది వేంకటేశ !

            ఏడుకొండల వెనుకకు  నె క్కి నీవు 
            కూరుచున్నావు ,మేమెట్లు  చేరగలము?
            చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
             చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
                                వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            ఏడు కొండలె కాదు ,నీ వేడ ను న్న 
            ముడుపు చెల్లించి ,మోక్షమ్ము పొంద గోరి 
            భక్తు లందరు ,నినుజేర పరుగు లిడుచు  
             భక్తి తోవచ్చు వారికి ముక్తి నిమ్ము !
                              వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            కష్ట ములకోర్చి ,నీదు ప్రాంగణము చేరి 
            మనసులో నున్న తమ కోర్కె మనసు నుండ 
            త్రోసి వేయుచు నుండిరి  'దూత' లచట ,
            భక్త కోటికి  నీ విచ్చు బహుమతదియ?
                               వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            మ్రొక్కు బడి తీర్చు   నాశతో , మోజు  పడిన ,
            రైలు టిక్కెట్లు , బసలు , కాళీలు లేవు ;
            అన్ని సేవల టిక్కెట్లు అమ్ము డయ్యె ,
            ప్రాప్త ముండిన  దర్శన భాగ్య మగును 
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
            దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
            సేవ చేయుచు పూజను చేయుదమిట 
            మమ్ము దీవించి యా శీస్సు లిమ్ము దేవ !
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            కోర్కె లెన్నున్న ,నీ ముందు కోర లేము ,
            కోరు కొనకుండ , అవిమాకు తీరు టెట్లు ?
            మనసు లో నున్న కోరిక మనవి జేయ 
            చేయు చున్నారు పూజలు,'ఖాయ 'మిదియె !
                                  వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
            కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
            పరిత పించెడి మాబోటి భక్తులకును 
            యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు 
                                   వినుము నా మాట నిజమిది వేంకటేశ !