శనివారం, డిసెంబర్ 31

కార్మికుడు - చదువు

          చదువు మీద శ్రద్ధ  సన్న గిల్లెడు నంత 
      ఆదిలోనె చదువు ఆగి పోవు,
      చదువు, శ్రమను బట్టి చాకిరీ యుంటుంది 
      చాకిరీయు బట్టి రూకలొచ్చు!                               1 
    
      కష్ట పడక పోతె గడవదు ఇల్లంచు 
      కాసు కొస మగును కార్మికుడిగ ; 
      చమట యోడ్చి యంత శ్రమ పడినను గాని 
      చేత నిలువ దెపుడు  చిల్లి గవ్వ !                             2 

      కండ బలము జూపి కార్మికుడానాడు
      ఫాక్టరీల యందు పనికి జేరె;
      బుద్ది బలము నిపుడు వృద్ది చేయక పోతె
      పనిని చేయ సాధ్య పడదు ఇపుడు                          3 

      కాల మిపుడు మారి కంప్యు టార్ లోచ్చేయి
      పాత చదువు లిపుడు పనికి రావు ;
      నాణ్య తొకటె గాదు నవ్యత చూపేటి 
      అవసరాలు నేడు అధిక మయ్యె !                              4 
     
      పాతకాలమందు వాడిన పని ముట్లు 
      పనికి రాక నేడు ప్రక్క బడియె ;
     శక్తి ,యుక్తి జూపి శ్రమి యించ బోకుంటె
     భావి బ్రతుకు మనకు భారమగును !                            5 

      కార్మి కుడియె గాని  కర్ష కుడియె గాని 
      చదువు రాక బోతే చవట యగును ;
     సంఘ గౌరవంబు  చదువర్లకే యుండు 
     సత్వ రమ్ము నీవు చదువు కొనుము !                          6 

      చదువు మాని వేసి చాల కాలం బయ్యె 
      చదువు ఎటుల అనెడి సంశ వద్దు 
      చదువు కొనుట కిపుడు చాల మార్గము లుండె
     మంచి మార్గ మెంచి మనిషి వగుమ !                             7 

      అనుభ వమ్ము మీద అధికార  మొచ్చినా 
      చదువు లేమి నిన్ను సాగ నీదు !
      అనుభ వమ్ము తోడ అక్షరం యుండినా 
      వంగి చేతు రపుడు వంద నాలు !                                 8 

      అవస రాలకు తగ్గట్టు  సవర ణిచ్చి
      నాణ్యతను పెంచి సరకుల నవ్య తకును
      శ్రద్ధ జూపెడి కార్మిక శ్రామికుని కి 
      యాజమాన్యపు సంపూర్ణ యండ యుండు                   9 

       నేర్పు తోడుగా వెనువెంటే  నిర్ణయాలు 
       తీసు కొనియెడి కార్మిక తెగకు విలువ 
        అట్టి విలువ నిచ్చేది  అక్ష రమ్మె
        తక్షణము  వచ్చి నేర్చుకో  అక్ష రాలు !                         10 

        కార్మికు లంతా ఒకటై 
       శ్రామిక విజయమ్ము పట్ల శక్తిన్ జూపీ 
       రమ్యపు వాతావరణము 
       సమ తుల్యత నొందు నటుల సరిదిద్ద వలెన్ !                 11       
   
   

శుక్రవారం, డిసెంబర్ 30

రంతీ కుమారి (కుంతీ కుమారికి పేరడే)

             అది రమణీయ దట్టవనమావన మందొక పల్లె ,పల్లెలో 
          అదియొక మారు మూల గ్రుహమా గృహ మందున నుండి వెల్వ డెన్
         పదు నయిదేండ్ల  యీడు గల బాలిక , పోలిక కొండపిల్ల ; జం
         కొదవెడి మోము తోడ దిగు చున్నది గుట్టను , వన్య మందునన్ !  1

        అక్షర హీనురాలివలె  ఆమెయు కన్పడె , కాదు కాదుగా !
        శిక్షణ నిచ్చు పుస్తకము చేతిని దాల్చిన యట్టు లుండె  ; ఓ 
        అక్షర దీప్తి సాయమున అక్షరముల్ తగ నేర్చియున్న , స 
       లక్షణ మామె చూపులో లభ్యము లాయెను చూచు వారికిన్ !        2           
       తీరుగా నున్న ముఖమును తీర్చి దిద్ది 
       పట్న వాసపు పిల్లలా  బట్ట కట్టి 
       హంస నడకల కాళ్ళతో నడుగు లేస్తు
       ముద్దు లలరగ యుండె నా ముగ్ధ  ముఖము !                           3
     
       భయము, భీతితో , హృదయమ్ము  భారమవగ 
      దు : ఖ భాష్పాలు కళ్ళలో దొరలు చుండ 
      తడబడయు చున్న అడుగులు  వడిగ  వేస్తు
      దిగియు చుండిన , యామె - రంతీ కుమారి !                              4 

      అడవి తల్లికి నాయకు  డామె తండ్రి 
      అన్నపూర్ణగ వెలెగెను యామె తల్లి ; 
      ఆమె కొచ్చిన కష్టంబు  యేమొ గాని ,
      కళ్ళలో  నుండి కన్నీరు కారు చుండె !                                     5 

      ఆకులలములు తినుచును  అడవు లందు 
      జీవ మొందెడు మమ్ముల చేర దీసి 
      చట్టముల పేర కులములు సర్దు పరచి 
      వేరు పరచిరి  ఓట్లకై  స్వార్ధ పరులు                                         6 

      వెనుక బడియున్న జాతంటు వేరు పరచి 
      చదువు లేనట్టి మాకును చదువు నేర్ప 
       బడులు  పెట్టారు మంచిదే  బడుగు లనుచు 
      మార్కు లందున సడలింపు మరల యేల ?                              7

     మార్కులు తక్కువైన సరె, మాకును వచ్చును సీట్లు యంచు ,మేం 
    మార్కుల కొస మెత్నములు , మానితి మప్పుడు బుద్ది లేక ; ఈ 
    మార్కు తొ సీటు లొ చ్చినను, మన్నన యుండునె ? తోటి వారిలో ?
    'మార్కుల పాసు లె న్నటికి మార్పులు తేవవె' జాతి పెంపునన్ !     8 

     ఏమిటి చేసుకుందు? నిపుడీ చదువెట్టుల  యుద్ధ రించు ?  నా 
    కేమిటి వచ్చు నిక్కముగ ? కేవల మక్షర మొ స్తే చాల ?  నీ 
    కేమిటి వచ్చు చెప్పమని ,నెంద రు ప్రశ్నలు  గుమ్మ రిన్చె? ఈ 
    నామపు మాత్ర విద్యల తొ , నవ్వులు పాలయె వన్య ప్రాంతముల్ !  9 

    చదువు కున్టూంది మా పిల్ల చక్క గాను 
    కష్ట పడ రాదు మా పిల్ల   కంది   పోవు,
    పనియు చేస్తున్న చదువంత  పాడు యగును 
    అనుచు  మా వారు పనిచెప్ప యడ్డు కొనిరి !                              10 

    ఇపుడు చూడమ్మ ! నా బ్రతుకు ఏమి టయెనొ !
    కష్ట పడలేక  పనిలోని  కరుగ లేక ,
    'పోటి' కెదురించి నిలుబడ ధాటి లేక 
     గాలి -నేలకు మధ్యను  వ్రేల బడితి !                                        11 

     చదువు కున్నట్టి వారితో సాగ గలమ?
     యనుచు మావారు  మను వాడ  యడ్డు పెట్టె ;
    'ప్రేమ నటియించి'  పెళ్లంటే  మోము త్రిప్పి 
    వెళ్లి పోయేడు పట్నంపు పెళ్లి కొడుకు !                                    12 

     ఏమి చేతును ? ఈ బాధ లెవరు వినును ? 
     బంధు జనులకు  నిప్పుడు భార మైతి ; 
     ఆత్మ గౌరవ  శ్రీయును  అణగి పోయె! 
     దైవ యోగంబు మీరంగ తరమే మనకు ?                              13 

     ఊరు వాడంత నా మీద యూసు లాడి
     చెప్పు కొను  చుండె  నన్నును డెప్పు చేయ 
     జీవితమ్ముపై యాసక్తి   చెరిగి  పోయె!
     ఆడ పిల్లకు మార్గమ్ము ఆత్మ హత్యె!                                    14 

      అనుచు పొత్తమ్ము రొమ్ముపై హత్తు కొనుచు 
      'రంతి'  దిగినది గిరి నుండి ; యంత లోన 
      'జీపు'  కాబోలు  శబ్దంబు చేసు కొనుచు 
      వచ్చు చున్నది యటు ప్రక్క వడిగ వడిగ !                          15 

      జీపు రాకను గని నంత జీవ మొంది
      బ్రతుకు పట్లను యాశలు వెతుక జొచ్చి 
      వేసి నడుగును కొద్దిగా వెనుక జాపి 
      'ఆపు ' మను నట్లు చేయ జాపి జీపు నాపె!                         16 

      అందులో నున్న అధికారి నామె జూచి 
      జీపు దిగి వచ్చి యామెను చేర దీసి 
      ఆమె నోదార్చి , ఆశ్రమ మామె కిచ్చి 
      అభయ మిచ్చాడు  ఉద్యోగ మామె కీయ !                           17 

       బ్రతుకు  పట్లను వైరాగ్య  భావ మొంది 
       ఆత్మ హత్యకు యత్నించు  నామే జూసి 
      అడవి తల్లికి , హృదయమ్ము సడలె నేమొ !
      'పీ.ఒ. ' రూపాన తెరువు జూ  పెట్టె నిటుల !                          18 

      వెనుక బడియున్న బడుగుల  వెలుగు జూపు 
      ప్రగతి మార్గము లెన్నియో  ప్రభుత  పెట్టె ! 
     చదువు నేర్పుచు  గిరిజన  జాతి యందు 
     మార్పు తేవాలి మీ లాంటి  మహిళ లనుచు                          19 

     పుట్టి నూరిలో బడియును, పెట్టి  నచటె
     టీ చరుద్యోగ మిచ్చియు తీర్చి దిద్దె; 
    చదువు కున్నట్టి చదువుకు సార్ధ తవగ
    గెంతు లేసెను రంతియు సంత సమున !                              20 
                     **********
( చదువు చెప్పే రోజుల్లో ఓ కొండపిల్ల మనో వేదనే  దీనికి స్ఫూర్తి )

   
     

     
        



బాల్య ఆశ్రమం

ఈ మధ్య , ( 20-12-2011)  బెంగుళూరు లొ అన్నపూర్ణ చారిటబెల్ వారు ,'బాల్య'  పేరుతో నడప బడుతున్న  ఉచిత పిల్లల గృహము ను సందర్శించే భాగ్యం మాకు కలిగింది  అప్పుడు నాలో కలిగిన భావాలు పద్యాల రూపం లొ పెట్టాలని పించింది ..  అవి పంపుతున్నా..  
         

                       అది అనాధ బాలుర యొక్క ఆశ్రమమ్ము
                        పేద పిల్లల అదృష్ట సౌ ద వమ్ము ,
                        బెంగుళూరు కు దూరంగ వెలసి యుండె;
                        "బాల్య" మనుపేర స్థాపించె భాగ్య మతులు  
  
                       కనియన్ పోషించ కష్టమని వదిలి -  పెట్టిన నిర్భాగ్య పిల్లలచట !
                      వడిన జోలిని కట్టి బిడ్డలన్ జూపుతూ - బిచ్చ మెత్తె డి పేద పిల్ల లచట !
                       ప్రేమ విఫలమొంది ,బెడిసి  కొట్ట గ కన్న - ప్రేమనోచని కుంతి పిల్లలచట !
                      చదువు నేర్చె డి యిచ్చ మెదడు లొ నున్ననూ -బడికి వెళ్లగ లేని బడుగు లచట;
                                    జాతి మతములు, కులముల జాడ్య మచట
                                     కాన రాకుండ వారంత కలసి మెలసి
                                    తల్లి- తండ్రుల  మాటను తలప కుండ
                                    ఆడు కొనుచుండి పాటలు పాడు కొనెడి
                                    చిట్టి చిన్నారి పిల్ల ల   చేష్ట జూస్తి ,
                                    బాల్య  ఆశ్రమ ఆదర్శ ప్రాంగణమున !

                        శ్రీమతి  అన్నపూర్ణ యట సేవను జేయుచు పూర్తీ కాలమున్
                        అమ్మల కన్న మిన్నగను ఆద ర ణిచ్చుచు చూచు చుండి , బల్
                        కమ్మగ వండు వంటలను  కడ్పుల నింపుగ పెట్టు చుండె ; వా
                         ర్సేమము  చూచు ఆయలట శ్రధ్ధగ బుద్ధులు చెప్పు చుండ గాన్

  

గురువారం, డిసెంబర్ 29

తెలుగు అక్షరమాల

               క్ష రాలను నేర్చు కుంటూ 
               ట  లందున శ్రద్ధ జూపీ   
          ఇంటి నెప్పుడు చక్క దిద్దుచు 
          తరమ్ముకు బాట వేద్దాం !

         న్న దానిలో దానమిచ్చీ 
          రు మేలుకు  ఉపక రిద్దాం 
         తు క్రమ ములొ పంటలేసి
          ఋ (రూ) క లెన్నియో ప్రోగు చేద్దాం ! 


          న్ని మతములు మనకి యున్నా 
          ది రాష్టం మతము అయినా 
          క మత్య మె మనదు మతమని 
          కరికొకరికి  సాయ పడదాం ! 


          టు హక్కుకి  విలువ తెలిపీ 
         త్సు కతతో ఓటు వేసీ,
         అం దమలరే ప్రజా స్వామ్యం 
         అ: రె  అనగా చాటి చెపుదాం ! 


         లము పట్టిన కాంతి రధమున 
       రము బ్రతుకు ఖండ నిద్దాం! 
        గ  ళము విప్పీ నిజము నెప్పుడు 
        ఘంట మలరగ చెప్పు కుందాం ! 

        చ మట లోడ్చీ స్వతంత్రమ్మును 
       త్ర పతులై  మనకు తెచ్చిరి !
        డ త్వమ్మును  వీడి మనలం 
        ఝండ నింగికి ఎగుర వేద్దాం ! 

        ముకు పట్టీ  దేశ  గీతాల్ 
        క్కు థ క్కున వల్లె వేయుచు 
       ప్పు కొడుతూ డాన్సు చేస్తూ 
        ఢంకా మ్రోత లొ పాడు కుందాం ! 

       రుణు లంతా ఎదురు తిరిగీ 
       ర ము నడుపుచు అన్న హాజరె
       దం డ యాత్రకు బయలు దేరిరి 
       ర్మ  రక్షణ  చేతు మంటూ !


       రమ సహనం ఓర్మి చూపుతు
       లము తదుపరి అనుభ విద్దాం!
       బడుగు వారికి మేలుకలిగే 
       భద్ర తిప్పుడు రల ఇద్దాం !

       యంత్ర  యుగమున  యువకు లంతా 
       రంగు రంగుల కలలు కంటూ 
       లక్ష ణం బగు  ప్రజాస్వామ్యం 
       క్రగతిలో నడుపు చుండిరి ! 


       శంక లెన్నో పెట్టుకుంటూ 
       రతు లేవో తీర్చ లేదని 
       సమాజమ్ముకు  హింస పెడుతూ 
      డలు కొట్టుట విడిచి పెడదాం 


    ( కొన్ని అక్షరాలు  దోషాలు ఉన్నాయి టైపు చెయ్యడం చేత కాక దిద్దు కో గలరు )
  
   

        
    


     
        
        
        


          

బుధవారం, డిసెంబర్ 28

కష్ట సుఖములు

 కష్ట సుఖములు మానవ ఖర్మ ఫలము 
కాలపరిధిలో మనిషికి కలుగు చుండు 
చింత నొందక వానిని చేద  పరిచి 
సాగి ఈదాలి జీవిత సాగరమ్ము !

ఆలయంబున పూజారి అగరువత్తి 
అగ్గి పుల్లని వెలిగించి నట్టి క్షణము 
నల్లతెల్లని పొగలతో నలుముకొనియు
అంత మొందుచు తుదకది ఆరిపోవు 


జగతి యనియెడి ఆలయ స్థలమునందు 
బ్రహ్మ వెలిగించు ఊదెత్తు బ్రతుకు మనది 
నల్ల పొగ లుగ కష్టాలు వెల్లి విరియు 
సుఖము లన్నియు తెల్లగా శుభము లిచ్చు !


జీవనమ్మెకారాదును జీవితమ్ము
మార్గ దర్శక మవవలె  మనిషి బాట 
మంచి బాటలో నడచిన  మంచి యగును 
చెడ్డ బాటలో నడచిన చెరుపు కలుగు !


( ప్రసన్న భారతి ఉగాది (ఏప్రిల్ 2003 )  లో ముద్రితం


 

మంగళవారం, డిసెంబర్ 27

చిత్ర సీమ చెద

 వినిపించదే నేడు వీనుల విందైన -ఘంటసాల మధుర గాత్రమిపుడు 
కనిపించదే నేటి సినిమాలలో హాస్య -నటరత్న రేలంగి నటన మనకు 
చెలగ దే  నేటి చిత్రాలలో యస్వి.రం - గారావు గద్గద కంట మిపుడు 
ఆగుపించ కుండె నే అత్తపాత్రలమేటి -సూర్యకాంతము వంటి సుదతిమనకు
              చిత్రసీమకు ఎంతయో సేవ జేసి 
              కీర్తి పొందిన మేటి సావిత్రి లేదె!
              ఏమి ఏమయ్యె? ఆ కీర్తి ఇపుడు మనకు 
              దిద్ద రారండి నిర్మాత దీరు లార !
ఆడమగంచు నెంచక నె యందరు పిల్లలు చేరి యొక్కడన్ 
ఆడుచు గెంతు లేయుదురు అర్ధము  పర్ధము లేని పాటలన్ 
పాడుచు డాన్సు చేయగ నె - ప్రక్కన చేరిన పెద్దలందరా
వేడుక వింత దృశ్యమును వీక్షణ చేయ రె ? ఎం తొ వింతగాన్!


కధయు యుండదు , నీతియు కానరాదు
పాటయందున సాహిత్య పటిమ లేదు 
కాన రా కుండె సంగీత కళయు కూడ ;
నిటుల యుండిన సినిమాల నెటుల చూతు !


సీనును బట్టి పాటలకు చిత్రణ యుండెను పూర్వ మందునన్
సీనియు ఏదియైన , అది చిత్రపు గాధకు యోప్పకున్డినన్
సీను లొ  భారిఎత్తునన్ సెట్టును వేయుచు , బ్రేకు డాన్సులన్
సీను లొ  గుమ్మరించు రవి ' చీయని ' విజ్ఞులు మోము త్రిప్పగన్!


స్పీడు పాటలనెడి పేరును పెట్టేసి 
డ్రమ్సు పోవునటుల డ్రమ్సు కొట్టి 
పాట హోరు లోన మాట అర్ధము కాక 
అతియు కాదు గాని మటియు పోయె!


అన్నపూర్ణా వారి అపురూప చిత్రాలు -మచ్చుకైన లే వె మంచివిపుడు 
విజయ  డ న్ఖా మ్రోగు విజయ సంస్థల యొక్క -పౌరాణిక చిత్రాలు మరల రావె
భరణి సంస్థల యొక్క భారి సంగీతంబు -చిత్ర మొకటి యైన  చిత్ర మవదె;
జానపద చిత్రాలు చక్కగా నిర్మించు - విటల ఆచార్యుండు వెలుగు లేదు 
          మంచి కధలను చిత్రాలు మలచు నట్టి
          జెమిని సంస్థల పేరును చెరిగి పోయె ;
           తెలుగు సినిమాల ప్రతిభను తీర్చి దిద్ద 
           సమయ మొచ్చింది సమరంబు సల్ప రండి !


           విలను పాత్రకి భాణీను మలచు నట్టి 
            నాగభూషను గొంతుక మూగ బోయె;
           కొత్త తరహా లొ  మాటలు గూర్చి చెప్పు 
           రావు గోపాల రావింక  రాదు మరల 
    
          
డిషుము డిషుము వంటి  డిస్కోల డాన్సులు 
వెగటు పుట్టునట్టి వెర్రి జోక్సు 
ఆడు మాట కిపుడు రెండేసి అర్ధాలు 
చిత్రసీమ కిపుడు చెదయు పట్టే !
 

 

సోమవారం, డిసెంబర్ 12

తెగులు పట్టిన తెలుగు యువత

                         అమ్మ నాన్న లిపుడు - 'మమ్మి- డాడీ' లయ్యె!
                'ఆంటి - అంకు' లయిరి - అత్త - మామ !            
                ఆశ్ర మాల కెల్లె  -  అమ్మమ్మ ,తాతయ్య       
                తెలుగు యువత కిపుడు తెగులు పట్టె !

                ఆకు ముందు వేసి అన్నము తినియడి
                పధ్ధ తంత నేడు ప్రక్క బడియె! 
                ప్లేటు పట్టు కెళ్ళి - ' పెట్టారా! కాస్తంత'
                అనుచు అడుగు  కొనెడి - తినుట వచ్చె!

                కిచిడి తో పులావు రుచులు మరిగినేడు,
                పప్పు అన్నము రసపు  వంట మరిచె;
                       బూర్లు, గార్లు ,సద్ది - పూర్తిగా మరిచేరు
                'ఫ్రయిడు ,పాని- పూరి ' ప్రియము లాయె!

                వార  మంత మందు  వారింట తినకుండ
                స్టారు హొటలు లోన చచ్చు తిళ్ళు,
                కొనియు తినుట నేర్చె కుర్రాళ్ళు ఈనాడు
                మత్తు లోన ఇంటి  మాట మరిచి ! 

                'చద్ది యన్నము , అంబలి'  చతిక బడియె 
                          వడలు ,సాంబారు ఇడ్లీలు -వలస వచ్చె !
                పాలతో వండు పరమాన్న మధుర వంట
                చంటి పిల్లకు కూడాను కంట క మ్మె


మంగళవారం, డిసెంబర్ 6

ప్రజా ప్రతినిధి -మనోవేదన



                                                              అవిశ్వాశము వీడిపోతే
                                       ఎవరికయ్యా నష్ట ముండును?
                                       ఉన్న పదవులు ఊడి పోవును
                                       ఊర్లొ పరపతి అటక ఎక్కును        

                                       పదవి పొతే పార్టి పొతే
                                       మల్లి గెలిచే చాన్సు యుండదు
                                       వేల కోట్ల లొ ఖర్చు తప్పా
                                       చేయ గలసిన దేమి యుండదు

                                       బ్రతికి ఉంటే బలిసి ఆకును
                                       తినియు బ్రతికియు యుండ వచ్చును
                                       పదవి పొతే తిరిగి మనకే 
                                       వచ్చు ననియడి  ఆశ పోయెను

                                       బలసి ఏలిన బడా బాబులు   
                                      దోచు కున్నది చాల యున్నది 
                                       జీవి తాంతము  ఖర్చు పెట్టిన 
                                       బ్రతక గలిగెడి ఆశ యున్నది

                                       మేము దోచిన సొమ్ము స్వల్పము 
                                       అదియు కాస్తా ఇపుడు పొతే 
                                       తినుట  కుండక  తిప్ప లిడుదుము
                                       అవిశ్వాసము కోటు వేయను 

                                                              రాష్ట్ర పాలన బాగు లేదని 
                                       మంత్రి  మాటలు నమ్మ వద్దని
                                       మరో మంత్రే  సర్ది చెప్పెను
                                       రచ్చ బండలొ రభస చేసెను

                                       అయినా .....

                                       ప్రభుత్వాని నె సమర్ధింతును
                                       ప్రజా ధనముకు  రక్ష నిత్తును;
                                       మంత్రులిచ్చే పారితోషము
                                       సగర్వంగా స్వీక రిద్దును
                             


                                    






సోమవారం, డిసెంబర్ 5

పేకాట

                                       ఎవరు కనిబెట్టె ? పేకాట ఏమొ గాని
                          అంటు కున్నది ఈ జబ్బు అందరికిని!
                          వదిలి బెట్టుదు మన్ననూ వదల లేక 
                          ఏసు టూత్రీ ల తో మళ్ళ అవతరించె !

                          రాత్రి పగలను మాటయే రాదు ఇటను:
                          ఆదివారాలు పండగ లడ్డు రావు ;
                          టిఫిను ,కాఫీలు తిండియున్ -తెలియ దిచట;
                          విసుగు లేదంటు భార్యయు విసుగు కున్న
                          వశము కాకుండె పేకాట వదల నాకు !

                          ఆడ మగయన్న బేదమ్ము అసలు  లేక,
                          ముఖము కానక నిక్నేము ముద్ర మీద 
                          పిల్ల వారలు వృద్ధులు  వేల మంది 
                          ఆడుచున్నారు నెట్టులో అద్భుతముగ !

                          డబ్బు పోకుండ హాయిగా ఉబ్బరముగ 
                          కాల మంతయు వూరికే గడచు చుండె!
                          ఎక్క డెక్క డొ మిత్రులు ఇటను  గాంచి 
                          ఆట  నాడేటి అదృష్ట  మమరె నిచట ! 

                 పేకను ఏల నేర్చితినొ ? పేకను నేర్చిన నేర్చు గాక ! నా
                 పేకను యాడనేల ? మరి పేకను స ద్దియు సద్ద గానె నా
                  క్జోకరు ఏల కాన బడె ? జోకరు వచ్చిన యూర కుందుమా?
                   పీకల లో తు కొచ్చినది ;  పీకిన వెంటనె ఫుల్లు నీయగా! 
                                     
           
                               

   
                     



శనివారం, డిసెంబర్ 3

తెలుగు వెలుగు


                   తెలుగు వారలంత తెలుగులో మాట్లాడ
                   మధుర రసము వోలె మంచి గుండు
                   తెలుగు వచ్చి గూడ తెలివంటు ఆంగ్లాన
                   మాటలాడ నాకు వళ్ళు మండు!
                   తెలుగు సభలలోన తెలుగులో మాట్లాడ
                   తెలుగు తీపి తనము తెలియ నగును
                   అట్లు గాక యచట ఆంగ్లమ్ము మాట్లాడ
                    తెలుగు గౌర వమ్ము వెలుగు పోవు ;
                 తెలుగు భాష యందె తీపి తనము యొప్పు
                 తెలుగు జాతి మనసు తేట తెలుపు
                 తెలుగు వంట రుచులు  దేశంబు కేఖ్యాతి
                 తెలుగు కట్టు బాటె వెలుగు జిలుగు

ఆదివారం, నవంబర్ 27

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

ఒరే ! పంతులా ! అని నన్ను ఆప్యాయంగా పిల్చే ఏకైక మాస్టారు , మా శ్రీ క్రొవ్విడి రామం మాస్టారు.
B.A.BL. చేసి B.Ed, చేసి పార్వతీపురం బోర్డ్ హై స్కూల్ లో మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు. సోషల్ కన్నా అతనికి తెలుగులో పాండిత్యం ఉండేది. పిల్లల కోసం చాల పుస్తకాలూ రాసారు.  తన ఒక పుస్తకాన్ని ఘంటసాల కి కన్యాదానం చేసేరు అప్పుడు అడిఒక గొప్ప గా అనుకునే వాళ్ళం .బెలగం, సంజీవి క్వార్టర్స్ లో ఉండేవారు. పిల్లల్ని పిలచి తను వ్రాసిన పద్యాలు చదివి పద్యాలు ఎలా రాయాలో చెప్పేవారు.
నేనూ మాస్టారు అయేక , ఒక సారి తన దగ్గర పబ్లిక్ పరీక్షలకి ,ఇన్విజిలేషన్ చేసే భాగ్యం కలిగింది 
పరీక్షలు అన్నీ అయిపోయేక ఆఖరి రోజు , సరదాగా  ఇన్విజిలేషన్ ఎలావుంది మాస్టారు? అన్నా!
వెంటనే , ఆశువుగా ఒకా పద్యం చెప్పారు అది ఇన్విజిలేషన్ కి వెళ్ళినప్పుడల్లా చెబుతూ వుండే వాడ్ని.
అది మీ కోసం:
                         స్లిప్పులను యేరి చీపుగా స్వీపరయితి
                         పేర్మి విండోల కెగబడు పెద్ద లెల్ల      
                         వెడలె ; నేనింక హాయిగా విశ్ర మింతు
                         అనుభవించితి ప్రారబ్ధ మధ్బుతముగ ! 

ఆ తరువాత కొన్నేళ్ళకి ,  ఇన్విజిలేషన్ మీద నేను వ్రాసిన పద్యం కొత్త కలాల లో పాడు ఇన్విజలేషను- మాస్టర్ల దురవస్థ పేరుతొ మొదటి సారిగా అచ్చు అయింది అది మీ అందరి కోసం:

           స్లిప్పు పట్టు కొనుట చేత కాదంటినా - అధికారి నామీద అలుసు జేయు;
           తెచ్చిన స్లిప్పులన్ తీసేసు కొందునా - విద్యార్ధి లోకమ్ము విరగి పడును;
           పట్టి నట్టియు స్లిప్పు పారేసి వేస్తినా - పిరికి  వానిగ నేను పిలువ బడుదు;
          చూసి చూడనట్లు చూడ కుండున్టినా- ఆత్మాభి మానమ్ము యడ్డు తగులు;
                              ఖరము కంటెను మేమంతా కష్ట పడియు
                              మూడు గంటల సేపు మే  ముంటి మేని
                               రెండు రూపాయలయ్య మా రేటు కూలి              
                              వద్దు వద్దుర ఈ పాట్లు వద్దు మనకు !
పీ .య స్.: ఈ పద్యం అచ్చు అయేక కూలి నాలుగు రూపాయలు చేసేరు ప్రభుత్వం



;






శుక్రవారం, నవంబర్ 25

కథా మంజరి: వేథం దిట్టగ రాదు ! ... కానీ ...

కథా మంజరి: వేథం దిట్టగ రాదు ! ... కానీ ...
వేధను తిట్టగ రాదని
మేధసు తో దూర్జటయ్య భేషుగ తిట్టెన్
పద్యానికి తగ్గుట్టుగా మీరు చేసిన
వ్యాఖ్యానం చాలా బాగుంది

గురువారం, నవంబర్ 24

కంపలుసరి -మధ్య తరగతి బతుకులు

కంపలుసరి -మధ్య తరగతి బతుకులు

                                      బట్టలుంచు కొరకు పెట్టైన లేకున్న
                                       గాడ్రేజు బీరువా కంపలుసరి

                          వందలు వేలైన వడ్డీలు కట్టైన   
                                       కలరు టీ.వీ నేడు కంపలుసరి
                          
                          వీధి బడులయందు మేధావి  గురువున్న
                                        కాన్వెంటు చదువులే కంపలుసరి

                          పెట్రోలు ధరలెంత పెంచి వేసిన గాని
                                       కార్లలో షీకార్లు కంపలుసరి

                               బ్యాంకు వడ్డీకి జీతమ్ము బదిలి కాగ
                               ఇంటి ఖర్చులు సర్దంగ నెట్టు లనుచు
                               బాధ పడుచును లోలోన రోధనొంది
                               మధ్య తరగతి బ్రతుకులు మంట గలిసె
                
             
                          

కంపలుసరి

                 మోర్నింగు నే లేచి ముఖమైన కడుగక 
                                      కాఫీని త్రాగుట కంపలుసరి
                 విడియము తరువాత విల్సను సిగరెట్లు
                                     గంటకొక పేకట్టు కంపలుసరి

                 ఈవినింగున రోజు ఇన్సల్టు అనియెంచి
                                   కాంతతో సినిమాకి కంపలుసరి

                  ఇంటిలో పనిలేక వంటరై యుండ్లేక
                                   క్లబ్బులో సిక్వేన్సు కంపలుసరి 
                      చేత దమ్మిడీ లేనిచో నీతి మాలి 
                                 స్త్రీల గళమందు వ్రేలాడు తాళి బొట్ట
                      అమ్ముటయునుకంపలుసరి లయ్యె నిట్టి
                       కంపలుసరీలతో మన కొంపలు సరి

      

పద్యం- ఘంటసాల

 పద్యానికి సంగీతము
హృది మెచ్చెడి భాణినీయ  ఉన్నతి నిచ్చున్
మధురమ్మగు గొంతుకతో
పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్

బుధవారం, నవంబర్ 23

ఆంగ్ల అక్షరాలతో మంత్రుల రచ్చబండ


                            A న్ని ఎన్నిక లోచ్చినా ఏమి ఫలము
                            B ద వారిని చూసిన నాధు లేరి?
                            C టు ముందర వాగ్ధాన మాట లన్ని
                            D ల పడిపోయి తదుపరి మూల పడును.

                           E ప్పుడిప్పుడే దేశంబు ఎదుగు చుండె
                           F సిబీసీల పేరుతో ఎడమ పరచి
                          G వి తాలతో కలతలు చేర్చి కూర్చ
                          H చ్చుసంఖ్యలో అవినీతి పెచ్చు పెరిగె

                         I కమత్యపు మాటను యలుసు జేసి
                        J యము కాంక్షించు వారికి జడుపు కలుగ
                        K క లేయుచు వారిని కించ పరుచ
                        L ల్ల వారలు సహనమ్ము కోలు పోయె

                      M . ఎ, ఎం. టెక్కు , బీటెక్కు, ఎమ్సి ఏలు,
                     N త చదువులు చదివిన ఏమి టగును?
                     O టు బాంకును  నోట్ల తో కాటు వేయ
                     P ల్ల వారిలో  నిస్పృహల్ పేరు కొనియె

                    Q లు  కట్టియు యువకులు  వేల కొలది
                    R త్త నాదాలు చేయుచు నరుచు  చుండ 
                    S  యస్సంటు మంత్రులు  ఎల్ల జేరి
                    T వి లోనుండి వినిపించె వింత వార్త

                    U వకు లందరు మెచ్చుతూ యూర డిల్ల
                    V సుగు చెందిన ఓటర్ల  మెప్పు పొంది
                   W  యూజికి పని  కొచ్చి  ,డబ్బు పొందు
                   X లేన్టగు ప్లానులు ఎంచి నాము
                   Y  న్క ? అధికార్లు ఎస్సంటే బిల్లు పెట్టి
                   Z  డ్జి మెంటును పెడుదుము జనుల మధ్య

   
 




 
  

  
    

మంగళవారం, నవంబర్ 22

రాజకీయ సమ్మెలు

 
 
సకల జనుల సమ్మె స్వార్ధంబు పిలుపుతో
పేద వారి పొట్ట ప్రేగు కదిలె!
వాహనాల మీద పరుగు లెట్టే డి i వార్కి,
నడిచి వెళ్ళు వారి బెడద లేల?

చదువు కొనియెడి విద్యార్ధి చదువు పోయె
కూలి చేసెడి  పనివారి కూలి పోయె,
అమ్ము కొని బ్రతుకు వ్యాపారి సొమ్ము పోయె,
ప్రగతి లొ నడ్చు రాష్ట్రపు పరువు పోయె!

బస్సు ఆటోలు సమ్మెంటు బందు జేయ,
ఆస్తు లన్నియు ద్వంసంబు నవగ జేయు,
నష్ట మెవరికి ? పేదోళ్ళ నడ్డి విరగి
రోజు గడవని కూలీలు రోడ్డున పడు

కే.సి.ఆర్, కే కె. కొదండ్ల కేల త్రయము
దుష్ట త్రయముగా  రాష్ట్రాన్ని బ్రస్టు జేసె!
కొట్టి కొట్టియు వారిని కొట్లో వేయ,
 సమ్మెలన్నియు పూర్తిగా సమసి పోవు.

వారు  చెప్పిన్డే వేదంగా మలచ మనుచు
నోటి కొచ్చిన విధముగా మాట లాడి
శాంతి గా యున్న రాష్ట్రమ్ము కాంతి నంత
రౌడి  ఇజముతో  రాష్ట్రాన్ని పాడు జేసె!

ప్రజల పట్లను వారికి మోజు లేదు
వారి మోజంత రాబోవు కుర్సి పైనె;
రాష్ట్ర విభజన సమ్మెతో రాదు గాని
 బందు పేరట పేదోళ్ళ బ్రతుకు చెడును !

ప్రాంత బాగుకు విభజనే మార్గ మగున?
ఎన్ను కున్నట్టి ప్రతినిధి నడ్డి విరచి
చేసుకోవాలి అభివృద్ది చేత నై తె ;
నోరు మెదపక ఇన్నాళ్ళు యూర కుండి
ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?

రెక్క యాడిన రోజునే డొక్క యాడు,
పనియు లేకున్న పస్తుయే వారి బ్రతుకు
కష్ట పడితే నె రోజులు గడవ కుండే,
కష్ట పడకుండ రోజులు గడుచ టెట్లు?

వడ్డీ తో బాటు జీతంబు వచ్చు ననుచు,
మంత్రి అయినట్టు ఆర్డరు పాసు జేసి
యూర డి స్తుండె సర్కారు ఉద్యోగులను
వారి కిస్తారు పైవారి మాట ఏమి?
పూట గడవని కూలీల మాట ఏమి?

సోమవారం, నవంబర్ 21

తెలంగాణా సమ్మెలు

                     సమ్మె పేరున బందు చేయుచు
                     ప్రభుత ఆస్థిని ధ్వంస పరుచుచు
                     చదువు చక్కగ చదువు కొనియెడి
                     పిల్ల వారిని ప్రొత్స హించుట

                                మంచి యగునని యెంచి నారా? 

        
                    రాజ ధానికె మకుట మణిమయు
                    అమర వీరుల విగ్ర హాలను
                    విరగ కొట్టీ పార వేస్తే
                    రాష్ట్ర విభజన జరుగు తుందా?
                                మంచి యగునని యెంచి నారా?

                    
                   తెలిసి తెలయని కుర్ర కారుల
                   అసంధర్భపు ఆత్మ హత్యలు
                   బీద తల్లుల కడుపు శొషకు
                  రాజకీయుల కంటి తుడుపే
                               మంచి యగునని యెంచి నారా?

కోడి విలాపం


    
తల్లి పండగ మరునాడు  తప్పకుండ  పూజ చేసిన కలుగును పుణ్య మనుచు
కోడి పిల్లను బలి ఇచ్చి కూర వండి బంధు మిత్రుల కొక్కింత పంచ నెంచి  !   1
నిశిని గడవగ హాయిగా నిదుర జేసి తెల్ల వారక పూర్వమే తెలివి రాగ
నూతి కడ కేగి నీటితో నోరు కడిగి  కోళ్ళ ఫారము కెల్లితి కోడి కొరకు    2
నే నొక  పిల్ల కోడి కడ నిల్చి గభాలున ముందు కేగి : చే
యానెడు నంత లోనే యది యార్తిని జూపు చు నోరు విప్పి, మా
ప్రాణము తీతువా?నరుడ! పాప మటంచును కూత పెట్ట : నా
మానస సీమలో తళుకు మన్నది "కోడి విలాప " మంత టన్ !  3
కోడి పలికిన మాటలో గొప్ప నిజము  దేవి కోరదు జగతిని జీవహింస
మనిషి స్వార్ధాని కిదియొక మారు పేరు అమ్మ పేరిట జచ్చును అల్ప జీవి    4
తల్లి జూపిన దారిని తప్పకుండ  వేడ్క జీవించు మమ్మిట్లు వేరు జేసి
పూజ పేరున చంపుట  పుణ్య మగున ? కరుణ విడ నాడి పూజ చేయ నేల ?    5
బుద్ది యున్నది విజ్ఞాన  సిద్ది కలదు జంతు బలి ఎంతో తప్పని చదివినావు
మ్రొక్కు బడిపేర నా పీక నొక్కి జంపు హీన కార్యంబు మిక్కిలి హీనమవధ ?   6
అల్పులము మేము కీడంటు సలుప లేము మానవులగూడి మనసిచ్చి  మసలు చుండి
అండము నిచ్చి వారిని యాద రించు మమ్ము జంపుట ధర్మమామానవులకు   7
తాతల నాటి సంప్రతిని తప్పక చేయుట ధర్మ మంచు; మీ
జాతికి మేలు చేయు గతి జాగృతి పెంచగ తెల్లవారి ,
మా కూతల తోనే లేపుదుము కూలికి వెళ్ళేడు కర్మ చారులన్
తరి కాల చక్రముకు నెన్నగ పెన్నిధి కోడి కూతయే !    8

కొక్కురో  యని మా కోడి కూత వినగ
వీధి గుమ్మాన ముగ్గులు వేయు తల్లి
హలము పట్టిన రైతన్న  పొలము పోవు
గుడిని గంటలు మ్రోగించు గురువు గారు   9

పిల్లల చేరు వయ్యదము పిల్లల తోడనె ప్రాంగనంబు, నం
దల్లరి చేయు పిల్లల తొ యాడుచు పాడుచు గెంతులేసి ; మీ
చెల్లని నూకలే తినుచు చిందులు వేయుచు సంచ రింతు మే
మల్లరి ఏమి జేస్తిమని హత్యకు మీరలు పూనికుంటిరో ?    10

పౌరు షానికి మా జాతి పేరు బడగ
వేడుకలు పెట్టి సమరంబు  క్రీడ పెట్టి
వూరు వాడల మా లోనె పోరు పెట్టి 
సంబ రాలను జూచుట సరస మగునె ?  11

కక్షలే లేని మాకాళ్ళ కత్తి గట్టి
కత్తులను నూరి మీ కుళ్ళు కక్ష తీర
రక్త వాహిని పారించు  రాక్షసంబు
నీచ  మని తెలియదా నీతి పరుడ ?    12

జాతిని పెంపు చేయుటకు చక్కని పద్ధతు లాచరించి ; మా
జాతిని వృద్ది జేసి కడు చక్కని ఫారము లెన్నొ కట్ట ; మీ
జాతికి కోడి పట్ల గల చక్కని భావము జూసి మేము ; మా
రాతలు మారె నంటు బహు రంజలి నారము సంత సంబుగా ! 13

ఫారములనుండి మమ్ముల బయట పెట్టి
లారి చక్రాల బండిపై లాగు కొనుచు
పొరుగు యూరుల తోలుకు పోవుచుండ
ప్రకృతిని జూచి మా గుండె పరవ సించె                                  14 

చేరాను విడనాడి బయటకు చేరి మేము
నింగి కెగురుట సుఖమని పొంగి నాము
గొంతు పైకెత్తి కూ కుహుల్  కూసినాము
ఎరుగామైతిమి తరువాత మరణ బాధ                                 15 

గోల చేస్తున్న మాయందు జాలి లేక
పీక నులుముట మీకంత ప్రీతి కరమ ?
కాల్చి చంపియు తిందురా ? కటిను  లార !
అల్ప జీవుల పట్ల మీకింత అలుసు ఏల ?                            16 

బుద్ధ దేముడు బాపూల బోధనలలొ
జీవ హింసయు  తప్పంచు తెలుప లేద ?
అట్టి మహానీయులేందరో పుట్టు గెడ్డ
మీరు హింసలు చేయుట మెచ్చ తగున ?                           17 

శుద్ధ గంగతో వంటిని శుద్ది జేసి
పసుపు కుంకుమ నుదుటను పట్టి వ్రాసి
మూడు మారులు దేవికి మ్రొక్కి తిప్పి
కొడవలిని బట్టి మా పీక కోయ తగున                                  18

అనుచు పిల కోడి తన బాస నాలపించ
బదులు చెప్పుట కేమియు పాలు పోక
పూలతో దేవి నర్చించి పూజ చేయ
తిరిగి వచ్చితి నిజమైన తెలివి నొంది  !                                 19           

(మిహిరలో ప్రచురితం)