సోమవారం, నవంబర్ 21

కోడి విలాపం


    
తల్లి పండగ మరునాడు  తప్పకుండ  పూజ చేసిన కలుగును పుణ్య మనుచు
కోడి పిల్లను బలి ఇచ్చి కూర వండి బంధు మిత్రుల కొక్కింత పంచ నెంచి  !   1
నిశిని గడవగ హాయిగా నిదుర జేసి తెల్ల వారక పూర్వమే తెలివి రాగ
నూతి కడ కేగి నీటితో నోరు కడిగి  కోళ్ళ ఫారము కెల్లితి కోడి కొరకు    2
నే నొక  పిల్ల కోడి కడ నిల్చి గభాలున ముందు కేగి : చే
యానెడు నంత లోనే యది యార్తిని జూపు చు నోరు విప్పి, మా
ప్రాణము తీతువా?నరుడ! పాప మటంచును కూత పెట్ట : నా
మానస సీమలో తళుకు మన్నది "కోడి విలాప " మంత టన్ !  3
కోడి పలికిన మాటలో గొప్ప నిజము  దేవి కోరదు జగతిని జీవహింస
మనిషి స్వార్ధాని కిదియొక మారు పేరు అమ్మ పేరిట జచ్చును అల్ప జీవి    4
తల్లి జూపిన దారిని తప్పకుండ  వేడ్క జీవించు మమ్మిట్లు వేరు జేసి
పూజ పేరున చంపుట  పుణ్య మగున ? కరుణ విడ నాడి పూజ చేయ నేల ?    5
బుద్ది యున్నది విజ్ఞాన  సిద్ది కలదు జంతు బలి ఎంతో తప్పని చదివినావు
మ్రొక్కు బడిపేర నా పీక నొక్కి జంపు హీన కార్యంబు మిక్కిలి హీనమవధ ?   6
అల్పులము మేము కీడంటు సలుప లేము మానవులగూడి మనసిచ్చి  మసలు చుండి
అండము నిచ్చి వారిని యాద రించు మమ్ము జంపుట ధర్మమామానవులకు   7
తాతల నాటి సంప్రతిని తప్పక చేయుట ధర్మ మంచు; మీ
జాతికి మేలు చేయు గతి జాగృతి పెంచగ తెల్లవారి ,
మా కూతల తోనే లేపుదుము కూలికి వెళ్ళేడు కర్మ చారులన్
తరి కాల చక్రముకు నెన్నగ పెన్నిధి కోడి కూతయే !    8

కొక్కురో  యని మా కోడి కూత వినగ
వీధి గుమ్మాన ముగ్గులు వేయు తల్లి
హలము పట్టిన రైతన్న  పొలము పోవు
గుడిని గంటలు మ్రోగించు గురువు గారు   9

పిల్లల చేరు వయ్యదము పిల్లల తోడనె ప్రాంగనంబు, నం
దల్లరి చేయు పిల్లల తొ యాడుచు పాడుచు గెంతులేసి ; మీ
చెల్లని నూకలే తినుచు చిందులు వేయుచు సంచ రింతు మే
మల్లరి ఏమి జేస్తిమని హత్యకు మీరలు పూనికుంటిరో ?    10

పౌరు షానికి మా జాతి పేరు బడగ
వేడుకలు పెట్టి సమరంబు  క్రీడ పెట్టి
వూరు వాడల మా లోనె పోరు పెట్టి 
సంబ రాలను జూచుట సరస మగునె ?  11

కక్షలే లేని మాకాళ్ళ కత్తి గట్టి
కత్తులను నూరి మీ కుళ్ళు కక్ష తీర
రక్త వాహిని పారించు  రాక్షసంబు
నీచ  మని తెలియదా నీతి పరుడ ?    12

జాతిని పెంపు చేయుటకు చక్కని పద్ధతు లాచరించి ; మా
జాతిని వృద్ది జేసి కడు చక్కని ఫారము లెన్నొ కట్ట ; మీ
జాతికి కోడి పట్ల గల చక్కని భావము జూసి మేము ; మా
రాతలు మారె నంటు బహు రంజలి నారము సంత సంబుగా ! 13

ఫారములనుండి మమ్ముల బయట పెట్టి
లారి చక్రాల బండిపై లాగు కొనుచు
పొరుగు యూరుల తోలుకు పోవుచుండ
ప్రకృతిని జూచి మా గుండె పరవ సించె                                  14 

చేరాను విడనాడి బయటకు చేరి మేము
నింగి కెగురుట సుఖమని పొంగి నాము
గొంతు పైకెత్తి కూ కుహుల్  కూసినాము
ఎరుగామైతిమి తరువాత మరణ బాధ                                 15 

గోల చేస్తున్న మాయందు జాలి లేక
పీక నులుముట మీకంత ప్రీతి కరమ ?
కాల్చి చంపియు తిందురా ? కటిను  లార !
అల్ప జీవుల పట్ల మీకింత అలుసు ఏల ?                            16 

బుద్ధ దేముడు బాపూల బోధనలలొ
జీవ హింసయు  తప్పంచు తెలుప లేద ?
అట్టి మహానీయులేందరో పుట్టు గెడ్డ
మీరు హింసలు చేయుట మెచ్చ తగున ?                           17 

శుద్ధ గంగతో వంటిని శుద్ది జేసి
పసుపు కుంకుమ నుదుటను పట్టి వ్రాసి
మూడు మారులు దేవికి మ్రొక్కి తిప్పి
కొడవలిని బట్టి మా పీక కోయ తగున                                  18

అనుచు పిల కోడి తన బాస నాలపించ
బదులు చెప్పుట కేమియు పాలు పోక
పూలతో దేవి నర్చించి పూజ చేయ
తిరిగి వచ్చితి నిజమైన తెలివి నొంది  !                                 19           

(మిహిరలో ప్రచురితం)













   


 






6 కామెంట్‌లు:

  1. సీతాపతిగారూ
    మీ కోడి విలాపం బాగుందండీ..

    రిప్లయితొలగించండి
  2. బాగుందండి. చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు కోడి విలాపం ఇపుడే చదివేను బావుంది

    మీ
    సుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  4. బాగుందండీ--ఇలాంటివి మీ అమ్ముల పొదిలో ఇంకా ఎన్నున్నాయో బయటకు తీయండి

    రిప్లయితొలగించండి