శనివారం, అక్టోబర్ 18

యువకిరీట

              జరిగి పోయిన దానికి జంక  కుండ
              మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
              పచ్చ దనమును  కాపాడ వచ్చు చున్న
              యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

             కష్టమున  నున్న  నగరాన్ని కనుల జూచి
            ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
            పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            రోడ్డు పొడవున చెట్లన్ని రూట్ల తోనె 
            కూలి పడియున్న దృశ్యాలు  జాలి కొలిపె ;
            యువత రక్తంబు అంతటన్ యురికి వచ్చి 
            చెట్లు తొలగించి ప్రక్కకు నెట్టు చున్న 
                యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            చెట్ల నడుమున నెలకొన్న చెత్త నంత
           యూడ్చి పెట్టియు ఒకప్రక్క కొ త్తి పెట్టి
           బాట లన్నియు పరిశుభ్ర  పరచు నట్టి
           యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

          జన్మ భూమికి యువకులు  సాయ మొసగ ,
          పచ్చ దనమున  వైజాగు పరవశించి
          పూర్వ వైభవ శోభను పొంద గలదు
          కాంతి వెలుగులు నగరాన కాన గలము !
             యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

         ఊడ్చి పెట్టియు వదలిన ఉత్తరాంద్ర
        తిరిగి తొలిరూపు పొందగా తీర్చి దిద్ద
        చంద్ర బాబుకు ఒకనికే సాధ్య పడదు
        జనుల సహకార ముంటేనె  సాధ్య మగును
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !










గురువారం, అక్టోబర్ 16

నీచ రాజకీయాలు


ప్రకృతి విధ్వంసానికి
నికృష్టపు రాజకీయ నిందలు తగునా?
అక్కడ ఎవరో ఓడితె
అక్కసుగా యూరి ప్రజల ననుటను సబుబా?

నోటికి వచ్చిన కూతలు
మాటాడక యుంట మీకు మంచిది సుమ్మీ!
ఓటమి చూస్తిరి గానీ
మాటలలో మీకు నింక మార్పే రాదా?

చేయు చున్నపనికి చేయూత నీయక
దె ప్ప డమ్ము మీకు తప్పుకాద?
విసుగు చెంద కుండ విశ్రాంతి లేకుండ
పనిని చేయు చుండె ,ప్రభుత ,నేడు .
అట్టి వారిపై నిందలు అభిమతంబ?

కార్యములయందు లోపాలు కాన వచ్చు
అవియు సహజము ,సహనమ్ము అవుసరమ్ము
బొత్స,రఘువీర,జగనులు బుద్ది వరులు
తెలుసు కొనివారు  ,విజ్ఞతన్ మెలగ వలయు

మంగళవారం, అక్టోబర్ 14

విజయ తాండాన ప్రకృతే విస్తు పోయె

       "హ్రుద్దు " పేరున కాలాగ్ని హుంకరించ
         సుందరంబైన "వైజాగు" శోభ పోయె ;
         గాలి ధాటికి చెట్లన్ని నేల కూలె  ,
         ప్రళయ ఘోషతొ  ప్రజలంత వణికి పోయె !
              దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 1.

       "హృద్దు " విలయంబు ధాటికి దద్ద రిల్లి ,
       ఇండ్ల కప్పులు , గుడిసెలు నెగెరె నకట ,
       వేల ఎకరాల పంటలు నేల  కొరిగె ,
       జీవ నోపాధి కోల్పోయె , జీవకోటి !
             దృశ్యములు చూడ మనసున దిగులు చెందె ..... 2.

       విద్యుదుత్పత్తి యంతటన్  వెసలి పడగ ,
       అంధకారాన నగరమ్ము అలమ టించె !
       నీళ్ళు రాకను, కాఫీకి ,పాలు లేక,
       బాధ చెందారు వైజాగు ,బాధితులట !
            దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 3


       పాలు ,నీళ్ళ కొరకు ప్రజలంతా పరుగెట్ట ,
       ధరలు పెంచడమ్ము ధర్మ మగున?
       మాన మత్వ మున్న మనిషిలా వర్తించి ,
       సాటి మనిషి కీవు సాయ పడుమ !
            దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 4.
.

      రాజ కీయు లంత రాజకీయము వీడి ,
      సహక రించ గలరు సాయ మందు,
     లాభ మందె  మీరు లక్ష్యంబు పెట్టక ,
     బీద వారి నెల్ల నాదు  కొనుడు !
             దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.


    ఓదార్పు చాల దిప్పుడు 
    ఏదో నొక సేవ నీవు నెంచుకు  చేయన్ !
   మోదము నొందును హృదయము 
   ఆ దేముడె , నిన్ను మెచ్చి ,అభినందించున్ !
                దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.


   ఇక మా యింటి కొచ్చిన ముప్పు!

    కిటికి  అద్దాలు ముక్కలై  క్రింద పడెను ,
    ఇంటి "అంటినా " ఎచటికో ఎగిరి పోయె ,
    ఇంటి ముందున్న గేటుయూ ,యిరిగి పడియె ,
    పనిని చేయంగ వర్కర్లు వినుట  లేదు .. 

     వినుట  లేదని నేనెట్లు వివరణిద్దు ?
     వారి కుండిన పనులే వొ ? వారి కుండు ,
     చిన్న పనులివి వారెట్లు చేయ గలరు ?
    చేసు కోవచ్చు ,తాపీగ , చేయ గలము. 

           నగర ముప్పున మా ముప్పు తగదు పోల్చ !









మంగళవారం, అక్టోబర్ 7

మారుషిస్ లోని అందాలు మరువ తగున?

        గంగ తలమను ప్రాంతమ్ము కలదిచంట 
        ఆకశంబంటు ఈశ్వరు నటను  గాంచ 
        కళ్ళు చెదురును ,పులకించు వళ్ళు గూడ ,
        ఈశ్వరభిషేఖముల్ రోజు నిచట జరుగు. 
                 మారుషిస్ దీవి  అందాలు మరువ తగున? 

        గుడికి దగ్గర్లొ  మరియొక కోవెలొప్పె ,
        అందు ,శివలింగముల్ యెన్నొ ? అలరి యుండె ,
        చూడ డానికి అదియెంతొ, సొంపు  గొలిపి 
        కాశి క్షేత్రంబు మనకట కానిపించు 
                   మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

        బాల కృష్ణుని ప్రీతి  గోశాల యొకటి
        దాని కెదురుగ మనలకు కాను పించు ;
        ఆవు దూడల తో పుష్టి  గోవులచట 
        వాని కాహార మందించు భక్తి వరులు . 
                    మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

        గంగ తలనుండి మరికాస్త కదలి  వెళ్ళ ,
        సహజ సౌందర్య ప్రకృతి సంబరాలు ,
        సరసు లందున బాతుల సరసు లాట ,
        పూత కొచ్చిన తేయాకు పొలము లెన్నొ ?
                       మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         తిరుపతిగ యెంచు 'లల్లోర' తీర్ధ మందు 
         వేంకటేశ్వర స్వామి కొవెలయు కలదు. 
         తిరుపతర్చక వర్యులు గురువు లిచట 
         తెలుగు వారంత  కలసెడి  తీర్ధ మిదియె !
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         సాంప్రదాయపు "సేవలు " జరుపుచుండి 
         అన్న ప్రాసాదముల్ తోడ హార తిచ్చు ;
         భక్తి శ్రద్దల నడుమున భక్తులంత 
         వరుస క్రమమును పాటించి ప్రార్ధనిడును !
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         దివ్య తేజస్సు తోయొప్పు ,దేవి యొకటి 
         'షెబలు' యనియెడి  ప్రాంతాన సిరులు గొలుపు 
         తమిళు లందరు నిచటకు  తప్పని సరి 
         "అమ్మ వారిని" దర్శించ నిచటి కొచ్చు!
                       మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

         ప్రాంగణము లోని కనిపించు ప్రతిమ లందు  
         తమిళ సంస్కృతి మనలకు  తనరు గలదు ;
         సాంప్రదాయపు ధోవతి, జడయు సిగతొ,
         అమ్మ వారిని కొలెచెద రయ్య వార్లు 
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
                  
          మనసు మెచ్చెడి 'ఇస్కాను'  మందిరమును 
          హర్ష మొందగ జూస్తి , మార్షీ ష్షు నందు ,
          హరి భజనలిట చెవులందు హాయి గొలుప ,
          పార వశ్యాన పులకించు భక్తు లిచట 
                        మారుషిస్ దీవి అందాలు మరువ తగున?

          ఇక ఆఖరుగా ,ఇట  కానరానివి, విననవి ,చూడనివి :-

                కారు లేగాని  ఆటోలు ,కానరావు 
                వినగ లేదిట కారు హారనుల మ్రోత ,
                రోడ్డు నందున చెత్తలన్  చూడ లేదు ,
                పారి శుద్ధ్యాన  ప్రకృతే పరవశించు !
                         మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
 
 
           
 
                     

          
       
         

మంగళవారం, సెప్టెంబర్ 30

వినుము నా మాట నిజమిది వేంకటేశ !

            ఏడుకొండల వెనుకకు  నె క్కి నీవు 
            కూరుచున్నావు ,మేమెట్లు  చేరగలము?
            చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
             చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
                                వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            ఏడు కొండలె కాదు ,నీ వేడ ను న్న 
            ముడుపు చెల్లించి ,మోక్షమ్ము పొంద గోరి 
            భక్తు లందరు ,నినుజేర పరుగు లిడుచు  
             భక్తి తోవచ్చు వారికి ముక్తి నిమ్ము !
                              వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            కష్ట ములకోర్చి ,నీదు ప్రాంగణము చేరి 
            మనసులో నున్న తమ కోర్కె మనసు నుండ 
            త్రోసి వేయుచు నుండిరి  'దూత' లచట ,
            భక్త కోటికి  నీ విచ్చు బహుమతదియ?
                               వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            మ్రొక్కు బడి తీర్చు   నాశతో , మోజు  పడిన ,
            రైలు టిక్కెట్లు , బసలు , కాళీలు లేవు ;
            అన్ని సేవల టిక్కెట్లు అమ్ము డయ్యె ,
            ప్రాప్త ముండిన  దర్శన భాగ్య మగును 
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
            దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
            సేవ చేయుచు పూజను చేయుదమిట 
            మమ్ము దీవించి యా శీస్సు లిమ్ము దేవ !
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            కోర్కె లెన్నున్న ,నీ ముందు కోర లేము ,
            కోరు కొనకుండ , అవిమాకు తీరు టెట్లు ?
            మనసు లో నున్న కోరిక మనవి జేయ 
            చేయు చున్నారు పూజలు,'ఖాయ 'మిదియె !
                                  వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
            కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
            పరిత పించెడి మాబోటి భక్తులకును 
            యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు 
                                   వినుము నా మాట నిజమిది వేంకటేశ !    

మంగళవారం, సెప్టెంబర్ 16

జడ శతకం

                పొడవగు జడతో  పాటుగ 

                జడ యందలి పూలు కూడ  చక్కగ  మెరెసెన్ !

                అడుగులు  వేసిన తోడనె                                         

                పడతులతోపాటు  జడయు వంకర పోవున్ !             1



                జడ పొట్టిది మెడ పొట్టిది 

                జడ వేయగ కురులు పొట్టి చచ్చే దెట్లా ?

                జడ నైతే సవరించెద 

               మెడ సవరణ సాధ్య మెటు లొ ? మీరే  చెపుడీ ?      2


               జడ గంటలు ,మెడ గంటలు 

              జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,

              జడ సొగసుకు యంద  మవగ  ,

              జడ నల్లక  విరగ బోయు సంస్కృతి పెరిగెన్!            3


              తడ కొట్టీ  జడ కురులను 

             ముడి వేయక ద్రౌపదపుడు పూనెను శఫధమ్ !

             జడ యందలి  సౌభాగ్యము 

             కడ  వరకూ యుండ వలయు కాంతల కెపుడున్ !       4


             జడ కుచ్చులు సవ రింపగ 

            ఎడపడగా  బ్యూటి కేర్లు  ఎది గెను  కానీ 

            సడలిన దేహము తోడుగ,

           జడ రంగుల మార్పు లన్ని సహజము కాదా!

బాపు రమణ

                            

                            బాపు రమణలు అపురూప ప్రాణ హితులు 
                             వారి బంధము అరువది వత్స రాలు 
                             మాట ఒకటియె ,నడచిన బాట ఒకటె 
                             తత్వ మొక్కటె, పరమాత్మ చిత్వ మొకటె !       1. 

                             ఆణి ముత్యాలు బాపుగారక్షరాలు ,
                             గీత సారాంసమే బాపు ' రాత-గీత' ,
                             శిల్ప చాతుర్య మంతటన్ సిరులు గొలుపు 
                             బాపు  చిత్రాలు ఓ కళా  రూప మణులు .          2

                             బాపు రమణీయ చిత్రాల వాస్తవాలు 
                             సహజ ప్రకృతన్దాలకు సాక్షికములు ,
                             పల్లె సీమల పదకేళి పలుకు జిలుగు 
                             బాపు రమణుల కమనీయ చూపు సరళి           3

                             బుడుగు  సృష్టించి  చిచ్చుల పిడుగు జేసి ,
                             రెండు జడలున్న సీతతో ఫ్రెండు జేసి                       
                             చిలిపి సీగాన ప్రసునాంబ  చెలిమి గలిపి 
                             వాసి గాంచిరి చరితలో  ' బాపు-రమణ '             4. 
    
                            కొత్త నటులను తెరపైకి ఎత్తి తెచ్చి 
                            తీర్చి దిద్దియు వారికి తెరువు జూపె ;
                            తీర అందాలు నిలిచేల సినిమ జేసి 
                            ప్రజల హృదయాన నిలచారు ' బాపు-రమణ '       5

ఆదివారం, సెప్టెంబర్ 7

శత జయంతీశ : సీతారామ మూర్తి

               శత జయంతిని ఈనాడు జరుపు కొనెడి 
               భళ్ల్ల ముడి శిరోమణి కి  నే ప్రణతు లిడుదు 
               వారి ఆశీస్సు బలముల అండ తోడె
              శిరులు భాగ్యాలు వంశాన చిగురు తొడగె  !

                సంస్కృ తాంధ్రాన ఆతండు  చాల దిట్ట 
                ఆశు వలరగ పద్యాల నల్లు మేటి ,
                పద్య మందున సాహిత్య పటిమ యొప్పు 
                గ్రంధ ముల నెన్నొ ఆతడు రచన జేసె !

               అపుడు సీతమ్మ, సూరమ్మ ఇపటి భార్య ,
               పేరు మారిన ఆదర్శ ప్రేమ జంట 
               పుత్ర పౌత్రాభి వృద్దియున్ పుడమి గాంచి 
               బ్రతికి నన్నాళ్ళు ఒకటిగా బ్రతికినారు !

              వారు కన్నట్టి  కలలన్ని ఫలిత మిచ్చె 
              వారు నాటిన చెట్లన్ని ఫలము లిచ్చె 
              వారి నడకయె పిల్లల బాటలయ్యె 
              వారు చేసిన పుణ్యాలె పేరు దెచ్చె !

             కురులు పండిన ఉత్తమ గురువు తాను 
            మనిషి నడవడి కతడొక మార్గ దర్శి !
            న్యాయ సలహాల కతడొక న్యాయ వాది 
            బంధు  హితులకు యతడొక పరమ హంస !

            శ్రద్ధ ధ్యానిత్తు  వారాత్మ శాంతి కొరకు ! 

 

శుక్రవారం, సెప్టెంబర్ 5

రామనామం

                                                                రామ నామమె  నాకు శ్రీ రామ రక్ష 

                                           రామ నామమె  ప్రజలకు రాచబాట 

                                           రామ పాలన సౌభాగ్య  రమ్య వరము 

                                           రామ చరితము ఆదర్శ గ్రంధ మయ్యె!


                                           రాముడె  దైవము లోకము

                                           రాముడె  నా తల్లి తండ్రి రక్షకు డిలనన్ !

                                           రాముడె  నా కృతియు భ్రుతియు 

                                            రాముని ఆశీస్సు బలమె  రమ్యత నాకున్ ! 


                                           సీతారాముల  జంటయె 

                                            ఏ తరముల వారికైన  ఇష్టపు  జంటౌ !
                                              
                                            ఏ తరి  వేడుక జరిగిన 
                                             
                                            "సీతా కళ్యాణ " పాటె  చెవిలో మ్రోగున్ !
                                           
                                                               

ఆదివారం, ఆగస్టు 31

నా డెబ్బది ఐదు


అబ్బుర సన్ని వేశ ములు అద్భుత మొందె డి  జీవితేత్రలో

నిబ్బర మొందు జీవితము , నివ్వెర పోయేల  నెట్టు కొచ్చి  నే

జబ్బుల నుండి తేరుకొని , సంతుల  మ్రొ క్కుల ప్రేమ కాంక్షతో

డెబ్బది  నాలుగున్ గడచి ,డెబ్బది ఐదులొ కాలు మోపితిన్ !

విజయ నామ సంవత్సర  భాద్రపద చవితి,
29 - 08- 2014    

బుధవారం, ఆగస్టు 27

మారుషిస్ అందాలు

మారుషిస్ అందాలు

మారుషిస్ లొని అందాలు మనసు తీర

చూసి వచ్చేము అదియెంతొ శొభమయము

అదిరి పోయెటి గృహముల అందమొప్పి

పూల తోటల నడుమున మోదమొప్పె!


ఇచ్చట వాతావరణము

ముచ్చట గా యుండి యెంతొ మొదము కలుగున్ !

హెచ్చో తక్కువొ కానీ

స్వచ్చంబగు కూరలన్ని చాలా దొరుకున్


భక్తి  భావమున్న భక్తులు ఎందరో

కాన వత్తురిటను గడప దాట!

శివుడు ,అమ్మవారు, శ్రీ వెంకటెశ్వర్లు

వేల్పు లందుకొనగ వెలసెరిచట!

మంత్ర తంత్రాలలొ యెట్టి మార్పు లేక

సాంప్ర దాయంగ పూజలు జరుగు నిచట

ధూర్త మాటలు ,కోట్లాట, తొపులాట్లు

కాన లేదిట దైవ ప్రాంగణము  నందు!


ఆంధ్ర రాష్ట్ర మన్న ఆంధ్ర సంస్కృతి యన్న

ఉత్త రాంధ్ర ప్రజల ఊసులన్న

ఇచట వారి కెంతొ ఇష్టమ్ము; "సింహాద్రి

అప్పడన్న " వీరి కమిత ప్రేమ

మంగళవారం, ఫిబ్రవరి 25

సమన్యాయపు ఎత్తుగడలు

అరుచు కున్నా మొత్తు  కున్నా -అరిచి చరిచియు కొట్టినా 
ఫ్లెక్సి  బోర్డులు కాల్చి కొట్టిన - పెపెరు బాంబులు వేసినా 
ఊరు వాడల బందు జరిపీ -ఊరి బస్సులు  ఆపినా 
పార్ల మెంటున పెట్టు  బిల్లుయు- ప్రజా మోదము నోందె రా !

విన్న పాలను ఎన్ని చేసిన - వినే నాధుడు లేడుగా 
నీతి తప్పిన నేర గాళ్ళే - నేత లయ్యిరి అటనురా !
నీతి నియమాల్ ప్రక్క బెట్టిన - నేత లచ్చట పెద్దలోయ్ !
ఊర డింపుగ కడుపు నిండని -ఉత్త హామీ లేలరా !

ప్రజల హక్కును  కాలదన్నే ప్రజా సంఘా లేలనొయ్ ?
జలము లేమితొ బాధ నొందే -జలా సయములు ఎందుకోయ్?
ప్రజల గోడును చెవిని పెట్టని - ప్రజా నాయకు లేలనొయ్?
రాజ కీయపు లబ్ధి కోసం - రాష్ట్ర విభజన జరుపగా!

కమల నాధుల సమ న్యాయం - కపట బుద్ధికి సాక్ష్యమా ?
జగను మోహను పదవి కాంక్షకు -చట్ట బద్రత సఖ్యమా?
కాంగ్రెసాడి న నాటకములో - కార్య కర్తల  వేషమా ?
తెలుగు దేశపు రెండు కళ్ళకు -తెగులు పట్టిన న్యాయమా ?





బుధవారం, ఫిబ్రవరి 19

విభజన ఆమోదం

రాజకీయుల  హస్త బలితో  - ప్రజా స్వామ్యం పరువు పోయెను 
అన్నదమ్ముల  మధ్య రగిలిన - చిచ్చు కాస్తా చిథిగ మారెను

రాజ కీయుల  లబ్ధి కోసం  - కేంద్ర మంత్రులు  క్రీడ లాడిరి 
రాష్ట్ర  ప్రజలలొ చిచ్చు రగెలెను - మండి పోయిన గుండె లాగెను 

వివాదాస్పద  చర్చ నడుమున  - విభజ నయ్యెను  విశాలాంధ్రా 
మోజు వాణీ ఓటుతో బిల్ - మోద  మొందిన ప్రకట నొచ్చెను 

కొట్టు కుంటూ  తిట్టు కుంటూ - ఎన్ని నాడులు కలసి ఉంటాం 
విడియు పోడం మంచి దైనా - విదియ గొట్టుట విస్తు పరిచెను

ఆదివారం, ఫిబ్రవరి 16

ఇది భావ్యమా!

ఓట్ల కోసం సీట్ల  కోసం  ఊచ కోతలు  భావ్యమా?
ప్రజల హక్కులు భంగ  పరచుట ప్రజాపాలన  యందుమా ?
పార్ల మెంటును నడప డానికి పదును కత్తులు వలయునా?
రాష్ట్ర విభజన పోరు కోసం  రాయబారా  లేలనోయ్ ?

ఐక మత్యమె  మహాబలమని  అంద  రెదుటా  చాటరా !
కలసి యుంటే కలదు సుఖమని కమలనాథుని  వేడరా !
సిరులు నింపే నదీ జలములు చెదిరి పోకను  చూడరా!
వృత్తి పరమగు పదవులందున బేధ భావము లేలరా?

చదువు కొనియెడి పిల్ల వారలు  చకితు లవ్వక  చూడరా !
వలస వచ్చీ  వాస మొందెడి ప్రజల  భీతిని  మాన్చరా !
వత్స రాలుగ కలసి యుండే  బంధు హితులను వీదియూ
పెంపు చేసిన మహా నగరము  వీడ మనుటయు భావ్యమా?

తెలుగు లంతా ఒక్కటే యని  తెలుగు గళమున  చాటరా !
తెలుగు భాషకు వన్నె తెచ్చే తీయ కవితలు వ్రాయరా!
తెలుగు జాతిని విడియ  గొట్టే తీర్పు రాకను ఆపరా!
తెలుగు వెలుగుకు జిలుగు లిచ్చే తెగువ ధాత్రిని  నిలుపురా!

సాంప్ర  దాయపు విలువ లెప్పుడు  చావ కుండగ  చూడరా !
కట్టు, బొట్టుల అంద  మెప్పుడు  గౌర వించుట  నే ర్పురా!
వేష  భూషణ లందు పిల్లల వెర్రి చేష్టలు మాన్చరా !
నీటి నియమాల్  విడిచి పెట్టుట నెఱవు  కాదని తెలుపుమా !

 
 

శుక్రవారం, జనవరి 24

నేటిబడులు - గైడో పాధ్యాయులు

ఉదయము  ఎనిమిది  మొదలిడి  రాత్రియు 
              ఎనిమిది వరకును  ఏమి చెప్పొ ?
బడులందె పిల్లల్ని బందీలు  చేసేసి
              కూర్చుండ బెట్టుట కూర్మి యగున?
చదవడానికి  టైము సరిగాను ఈయకే 
              ఎగ్జామ్స్  పెట్టుచో  ఏమి వ్రాయు ?
రోజుకి  రెండేసి 'ఎగ్జామ్స్'  "పెట్టేసి 
           వ్రాయమనుట  ఎంత న్యాయ మగును?

మార్కు  తగ్గంగ  పేరెంట్లు  మంద లించు ,
 కోపమున కొట్టు  గురువులు కొరడ దెబ్బ
స్నేహితుల  మధ్య అవమాన సిగ్గులయలు 
చేటు చేస్తుండె  విద్యార్థి  చిన్న మనసు !

ముఖ్య మైనట్టి  ప్రశ్నలు ప్రోగు జేసి 
వత్స రమ్మంత వాటినే వల్లెవేసి 
వంద సారులు వానినే వ్రాయ మనుచొ 
మార్కులే కాని జ్ఞానమ్ము  మరుగు పడును !

పాఠ్య పుస్తక  పాఠాలు పటన  జేసి
తెలియ బోతేను అడిగియు తెలుసు కొనుచు 
స్వంతముగ నోట్సు వ్రాసెడి పద్ధ తిపుడు 
మరుగు పడిపోయె గైడుల  మహిమ చేత !

పాఠ్య గ్రంధాల నన్నిటిన్ ప్రక్క పెట్టి 
గైడులో నున్న ప్రశ్నలే  గ్రహణ జేయ ,
మార్కు లొచ్చును ,జ్ఞానంబు  మందగించు 
చదువు లందున కాన్సెప్ట్  చచ్చి పోవు!

గైడులే  నేటి  గురువుల  కల్ప వల్లి 
గైడు లేకుండ వెళ్ళరు క్లాసు కెపుడు 
గైడు నందలి విషయాలు కాపి కొట్టి 
బోర్డు నెక్కించు  వారలే బోధకులయె !
 


సోమవారం, జనవరి 20

చచ్చి పోతూన్న సాంప్రదాయాలు

వేలాము  వెఱ్ఱిగా వెఱ్ఱి  లెక్కువ  అయ్యు 
            సత్ సాంప్రదాయాలు  చచ్చి పోయె !
మగవార్కి  పోటీగ  మత్తుకు  లోనయ్యు 
             మందు బానిసలయ్యె  మగువ లిపుడు 
టీవీల  మోజులో  తేలియాడుతు  జనం 
             విలువైన  కాలాన్ని బీడు  జేసె !
పరుగు లెత్తెడి  ఆట పాటలన్  మానేసి 
             వీడియో  గేమ్సు కి  వెడలు  చుండె 
     "నీతి" నియమాలు ప్రక్కకు  నెట్టి  వేసి 
      స్వార్ధ  చింతన  నేతల  శ్వాస అయ్యె 
      ఆక తాయల వేదింపు  ఆగడాలు 
      మితియు మీరక  ఆపాలి మేలు గాంచి !

      నేతి  బీరలో యుండిన నేయి విధము 
      నేత లందున యుంటూంది నీతి ఇపుడు 
      స్వార్ధ కీయపు  నేతల  స్వాంత నమ్మె 
      నేటి అవినీతి కంతకున్ బాట యయ్యె !
                      

శనివారం, జనవరి 4

మూడు పండగలు

మూడు   పండగలు
భోగీ  పండగ:
భోగి మంటకు కఱ్ఱలు  ప్రోగు  జేసి
గుమ్మ  మందున ముగ్గులు గుమ్మ రించి
గోయి త్రవ్వియు చుట్టునూ గొబ్బిలుంచి
అర్ధ రాతిరి మంటను  నంట  జేయు
            సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

భోగి పిడకల దండలు బొందు  కూర్చి
భోగి మంటలో అవి వేసి భాగ్య మొంది
స్నానమును జేసి బట్టలు మేను  దాల్చి
పెద్ద లాశీస్సు బదియగా వేల్పు లిడె డి
            సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

ముత్తై దువలను పెరంటమునకు  పిలచి
బుజ్జి పాపని అమ్మమ్మ  ఒజ్జ నుంచి
వాయనమ్మిచ్చి పిల్లలకి పైస లిచ్చి
భోగి పళ్ళను  పోయుచు   మురెసెనట్టి
           సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

సంక్రాంతి :
దక్షిణము  నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని చీల్చి వెలుతురు చిందు చేయు
సూర్య దేముడు గమనంము మార్చు రోజు
సంక్ర మాన ము నుండియే  సంకర మించు

పొలము నందు పండు ఫలసాయ ఫలములు
ఇంటి కొచ్చు రోజు ఈదినమ్మె
అంబరాలు తాకి  సంబరాలను తాకు
సంద డైన రోజు సంకు రాత్రి

మరణ మొందిన పెద్దలన్  మనసు నిల్పి
జ్ఞప్తి పెట్టుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
పర్వ దినముగ  సంక్రాంతి  పరిగ నించె
           సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

పట్టు చీరలు చక్కగా కట్టు కొనియు
పసుపు కుంకుమ ప్రతి ఇంట  పంచు కొనియు
ఆడపడుచుల సంబర అంబరాలు
పెద్ద పండగ రోజునే ప్రియము నొప్పు

కనుమ:
 సేద్య పనులలో ఎంతయో సేవ జేసి
అలసి సొలసియు గోవుల కంజ లిడుచు
పిల్ల పాపల తొడుగా పొలము కేగి
కనుమ రోజున భూమికి ప్రణతు లిడ రె !
       సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

శుభా కాంక్షలు :

భోగి మంటల కెగిసెది  భాగ్య సిరులు
సంకు రాతిరి  పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్లా కాలము మీ యింట  నిమడ గలవు