మంగళవారం, సెప్టెంబర్ 30

వినుము నా మాట నిజమిది వేంకటేశ !

            ఏడుకొండల వెనుకకు  నె క్కి నీవు 
            కూరుచున్నావు ,మేమెట్లు  చేరగలము?
            చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
             చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
                                వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            ఏడు కొండలె కాదు ,నీ వేడ ను న్న 
            ముడుపు చెల్లించి ,మోక్షమ్ము పొంద గోరి 
            భక్తు లందరు ,నినుజేర పరుగు లిడుచు  
             భక్తి తోవచ్చు వారికి ముక్తి నిమ్ము !
                              వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            కష్ట ములకోర్చి ,నీదు ప్రాంగణము చేరి 
            మనసులో నున్న తమ కోర్కె మనసు నుండ 
            త్రోసి వేయుచు నుండిరి  'దూత' లచట ,
            భక్త కోటికి  నీ విచ్చు బహుమతదియ?
                               వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            మ్రొక్కు బడి తీర్చు   నాశతో , మోజు  పడిన ,
            రైలు టిక్కెట్లు , బసలు , కాళీలు లేవు ;
            అన్ని సేవల టిక్కెట్లు అమ్ము డయ్యె ,
            ప్రాప్త ముండిన  దర్శన భాగ్య మగును 
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ !  

            పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
            దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
            సేవ చేయుచు పూజను చేయుదమిట 
            మమ్ము దీవించి యా శీస్సు లిమ్ము దేవ !
                                 వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            కోర్కె లెన్నున్న ,నీ ముందు కోర లేము ,
            కోరు కొనకుండ , అవిమాకు తీరు టెట్లు ?
            మనసు లో నున్న కోరిక మనవి జేయ 
            చేయు చున్నారు పూజలు,'ఖాయ 'మిదియె !
                                  వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 

            వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
            కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
            పరిత పించెడి మాబోటి భక్తులకును 
            యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు 
                                   వినుము నా మాట నిజమిది వేంకటేశ !    

4 కామెంట్‌లు:

  1. నీ పద్యాలు చాలా బాగున్నాయి. బ్రహ్మఓత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించ లేని ఆర్తి కనిపంచింది. భావాలు చక్కగా ఉన్నాయి, రెండో పద్యంలో నీ దరి పరుగు లిడుచు అని ఉండాలేమో చూడు.

    రిప్లయితొలగించండి
  2. పద్యాలు బాగున్నాయి. . వెనుకకు ఎక్కి నీవు అన్నదాంట్లో ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం అన్నది మరచారు. వెనుక కెక్కి అని తప్పని సరిగా అవుతుంది.

    'నీ వేడ యున్న' అని వ్రాసారు. ఇక్కడ యడాగమం సరికాదు. 'నీ వేడ నున్న' అనటం సరైనది.

    'నీదరి ,పరుగు లిడును' అన్నది అన్వయం కావటం లేదు. సరిగా లేదు. 'నినుజేర పరుగులిడుచు' అనండి.

    'మనసులో నున్న తమ కోర్కె మనసు యుండ' అన్నది పునరుక్తి మరియు కొంచెం అనన్వయం. పైగా మనసు యుండ అని యడాగమం సరికాదు కూడా. మనసు + ఉండ -> మనసుండ అని కాని మనసున + ఉండ -> మనసునుండ అని కాని అవ్వాలి. ఇక్కడ మార్పు చేయండి. బహుశః '' అనవచ్చును. నీ త్రోసి వేయుచు నుండె 'దూత' లచట అన్నప్పుడు బహువహనం కనుక 'త్రోసి వేయుచు నుండిరి దూత లచట' అనాలి. ఏకవచనంలో ఐతే త్రోసి వేయుచు నుండె నీ దూత యచట' అనవచ్చును. మీ యిష్టం.

    తీర్చెడి ఆశతో అన్నచోట మధ్యలో అచ్చు రావటం సంప్రదాయం కాదు. నా పద్యం నాయిష్టం అనకపోతే, తీర్చెడి యాసతో అనండి యడాగమంతో. అలాగే టిక్కెట్లు అమ్ముడయ్యె బదులు టిక్కెట్లు నమ్ము డయ్యె అనండి.

    'ప్రాప్త ముంటేనె దర్శన భాగ్య మగును' అన్నది చాలా శక్తివంతమైన భావప్రకటన. అభినందనలు. చిన్న సవరణ. ఉంటేనె అని వ్యావహారికంగా అనకూడదు పద్యాల్లో. 'ప్రాప్త ముండిన దర్శన భాగ్య మగును'అని సరిజేయగలరు.

    పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
    దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
    మూల కూర్చొని చేసేద పూజ నేను ,
    మమ్ము దీవించి ఆశీస్సు లిమ్ము దేవ !

    భేషైన పద్యం!

    'కోరు కోకుండ' అన్నది వ్యవహారికం కదా. కోరుకొనకుండ అని మార్చగలరు.

    వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
    కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
    పరిత పించెడి నా బోటి భక్తులకును
    యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు

    మంచి పద్యం. బాగుంది.

    ఇలా సంధులు మొదలైనవాటి విషయం కొంచెం చూచుకోవలసింది పద్యాల్లో అలా సరి యైన గ్రంథభాషలో వ్రాయక తప్పదు. ఈ రోజుల్లో వచన పచన కవిత్వాల్లో ఎవరిష్టం వారిది. అది వేరే సంగతి అనుకోండి..

    ఈ విధంగా సవరణలు వగైరా విషయాలు చెప్పినందుకు అన్యధా భావించవద్దని మనవి. మీకు నచ్చితే సవరించుకోండి. మీకు తెలుగుపద్యం పైనున్న అభిమానానికి పట్టుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సవరణలు వగైరా విషయాలు చెప్పినందుకు సంతోషం తెలియాలి కదా నిజం తొందరలో ఏదో వ్రాయాలని వ్రాసేస్తే ఇలాగే అవుతున్ది.
    ఏమైనా మీ సవరణలకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి