తిట్టు రాజకీయాలు :
సిగ్గు లజ్జ లేక సిగ పట్లు పట్టేసి ,
నీవు ఎంత ? నీది నీతి ఎంత ?
ననుచు తిట్లు తిట్టు అరగంట లోపలే
కలసి విందు జేసి కలసి పోవు !
తెలుగు భాష లోని తిట్లన్ని తిట్టేసి ,
ఇతర భాష తిట్లు నిముడ జేసి ,
తిట్టి నట్టి తిట్టు తట్ట కుండగ తిట్టు
నీతి లేని వారు నేత లయిరి !
తట్లు తినగ బోతే తెల్ల వారదు వార్కి
తిట్ల తోనె రోజు తెల్లవారు ;
నిద్ర యందు కూడ నిట్టి తిట్టులె వచ్చు
తిట్లు తిట్ట బోతే తెలివి రాదు !
అక్ర మార్జన సొమ్ములు నాశ జూపి ,
నీతి నియమాలు విడచిరి నేత లిపుడు ;
ఒకరి పైనను మరియొక రుమ్ము కొనుచు ,
సిగ్గు లేకుండ మర్నాడె చెంత చేరు !
రోడ్డు షోలు పెట్టి రోడ్లన్ని మూసేసి
మైను రోడ్డు నడుమ మైకు లెట్టి
ప్రజల కష్ట సుఖము పట్టించు కోకుండ
సభలు నిర్వ హించ సభ్య తగున ?
ఐచ్చి కముగ తాను అయిదేళ్ళు ప్రజలకు
సేవ చేతు నంచు శఫద జేసి ,
పదవి మధ్య లోనే పదవి వీడి మరల
ప్రాకు లాడ తగున పదవి కొరకు ?
రాజి నామ చేయు మాజీయ వర్యులే
ఎన్ని కలల ఖర్చు నీయ వలయు
ననెడి బిల్లు యొకటి ఆమోద మొందు తే,
సమసి పోవు 'రాజి నామ ' సొగసు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి