శుక్రవారం, జనవరి 24

నేటిబడులు - గైడో పాధ్యాయులు

ఉదయము  ఎనిమిది  మొదలిడి  రాత్రియు 
              ఎనిమిది వరకును  ఏమి చెప్పొ ?
బడులందె పిల్లల్ని బందీలు  చేసేసి
              కూర్చుండ బెట్టుట కూర్మి యగున?
చదవడానికి  టైము సరిగాను ఈయకే 
              ఎగ్జామ్స్  పెట్టుచో  ఏమి వ్రాయు ?
రోజుకి  రెండేసి 'ఎగ్జామ్స్'  "పెట్టేసి 
           వ్రాయమనుట  ఎంత న్యాయ మగును?

మార్కు  తగ్గంగ  పేరెంట్లు  మంద లించు ,
 కోపమున కొట్టు  గురువులు కొరడ దెబ్బ
స్నేహితుల  మధ్య అవమాన సిగ్గులయలు 
చేటు చేస్తుండె  విద్యార్థి  చిన్న మనసు !

ముఖ్య మైనట్టి  ప్రశ్నలు ప్రోగు జేసి 
వత్స రమ్మంత వాటినే వల్లెవేసి 
వంద సారులు వానినే వ్రాయ మనుచొ 
మార్కులే కాని జ్ఞానమ్ము  మరుగు పడును !

పాఠ్య పుస్తక  పాఠాలు పటన  జేసి
తెలియ బోతేను అడిగియు తెలుసు కొనుచు 
స్వంతముగ నోట్సు వ్రాసెడి పద్ధ తిపుడు 
మరుగు పడిపోయె గైడుల  మహిమ చేత !

పాఠ్య గ్రంధాల నన్నిటిన్ ప్రక్క పెట్టి 
గైడులో నున్న ప్రశ్నలే  గ్రహణ జేయ ,
మార్కు లొచ్చును ,జ్ఞానంబు  మందగించు 
చదువు లందున కాన్సెప్ట్  చచ్చి పోవు!

గైడులే  నేటి  గురువుల  కల్ప వల్లి 
గైడు లేకుండ వెళ్ళరు క్లాసు కెపుడు 
గైడు నందలి విషయాలు కాపి కొట్టి 
బోర్డు నెక్కించు  వారలే బోధకులయె !
 


సోమవారం, జనవరి 20

చచ్చి పోతూన్న సాంప్రదాయాలు

వేలాము  వెఱ్ఱిగా వెఱ్ఱి  లెక్కువ  అయ్యు 
            సత్ సాంప్రదాయాలు  చచ్చి పోయె !
మగవార్కి  పోటీగ  మత్తుకు  లోనయ్యు 
             మందు బానిసలయ్యె  మగువ లిపుడు 
టీవీల  మోజులో  తేలియాడుతు  జనం 
             విలువైన  కాలాన్ని బీడు  జేసె !
పరుగు లెత్తెడి  ఆట పాటలన్  మానేసి 
             వీడియో  గేమ్సు కి  వెడలు  చుండె 
     "నీతి" నియమాలు ప్రక్కకు  నెట్టి  వేసి 
      స్వార్ధ  చింతన  నేతల  శ్వాస అయ్యె 
      ఆక తాయల వేదింపు  ఆగడాలు 
      మితియు మీరక  ఆపాలి మేలు గాంచి !

      నేతి  బీరలో యుండిన నేయి విధము 
      నేత లందున యుంటూంది నీతి ఇపుడు 
      స్వార్ధ కీయపు  నేతల  స్వాంత నమ్మె 
      నేటి అవినీతి కంతకున్ బాట యయ్యె !
                      

శనివారం, జనవరి 4

మూడు పండగలు

మూడు   పండగలు
భోగీ  పండగ:
భోగి మంటకు కఱ్ఱలు  ప్రోగు  జేసి
గుమ్మ  మందున ముగ్గులు గుమ్మ రించి
గోయి త్రవ్వియు చుట్టునూ గొబ్బిలుంచి
అర్ధ రాతిరి మంటను  నంట  జేయు
            సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

భోగి పిడకల దండలు బొందు  కూర్చి
భోగి మంటలో అవి వేసి భాగ్య మొంది
స్నానమును జేసి బట్టలు మేను  దాల్చి
పెద్ద లాశీస్సు బదియగా వేల్పు లిడె డి
            సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

ముత్తై దువలను పెరంటమునకు  పిలచి
బుజ్జి పాపని అమ్మమ్మ  ఒజ్జ నుంచి
వాయనమ్మిచ్చి పిల్లలకి పైస లిచ్చి
భోగి పళ్ళను  పోయుచు   మురెసెనట్టి
           సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

సంక్రాంతి :
దక్షిణము  నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని చీల్చి వెలుతురు చిందు చేయు
సూర్య దేముడు గమనంము మార్చు రోజు
సంక్ర మాన ము నుండియే  సంకర మించు

పొలము నందు పండు ఫలసాయ ఫలములు
ఇంటి కొచ్చు రోజు ఈదినమ్మె
అంబరాలు తాకి  సంబరాలను తాకు
సంద డైన రోజు సంకు రాత్రి

మరణ మొందిన పెద్దలన్  మనసు నిల్పి
జ్ఞప్తి పెట్టుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
పర్వ దినముగ  సంక్రాంతి  పరిగ నించె
           సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

పట్టు చీరలు చక్కగా కట్టు కొనియు
పసుపు కుంకుమ ప్రతి ఇంట  పంచు కొనియు
ఆడపడుచుల సంబర అంబరాలు
పెద్ద పండగ రోజునే ప్రియము నొప్పు

కనుమ:
 సేద్య పనులలో ఎంతయో సేవ జేసి
అలసి సొలసియు గోవుల కంజ లిడుచు
పిల్ల పాపల తొడుగా పొలము కేగి
కనుమ రోజున భూమికి ప్రణతు లిడ రె !
       సాంప్ర దాయము ఎలానో  సన్నగిల్లె

శుభా కాంక్షలు :

భోగి మంటల కెగిసెది  భాగ్య సిరులు
సంకు రాతిరి  పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్లా కాలము మీ యింట  నిమడ గలవు