శనివారం, నవంబర్ 19

విశ్రాంతి


విశ్రాంతి 


తీరు బడిలేని జీవన -సరళి యందు
ప్రక్రుతి అందాలు తిలకించి - పరవశించి
మెచ్చు కొనియెడి తీరికే -మియును లేక
బ్రతుకు చున్నారు బాధలన్ -మనుజు లిపుడు 1

నింగి నెగెరెడి తెల్లటి - కొంగ పంక్తి
చెట్ల మధ్యన కట్టిన - చిలుక గూడు
ఆకసంబున కనుపించు - హరియు విల్లు
నేరుగా చూచు భాగ్యపు - తీరి కేది? 2


పండ గందున హరిదాసు - పాట గాని
గంగి రెడ్డుల క్రీడల - భంగి కాని
కోడి పోరుల పందాల - వేడి కాని
చూచి ఆనంద పడియెడి - సొగసు లేదె?! 3
పగలు రాత్రియు అనియెడిమాట లేదు
పనుల యందున తీరిక - కానబడదు
"లాబు టాబులు సెల్ ఫోన్లె '- లాలి తములు
 ఇంట యుండిన విశ్రాంతి - ఏమి గనము 4

 ఇరుగు పొరుగుల వారలు - ఎరుక పడరు
 అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు - అన్న లందు
 మమత అనురాగ మొలికించి - మాట లాడు
 సమయమే లేదు కలిసుండి - సాయ మలర 5

 యాంత్రి కమ్మున రోజులు - గడుచు చుండె
 భార్య బిడ్డల తోడుగా - బయట కెళ్ళి
 మనసు విప్పియు మాట్లాడ - మవుట లేదు
 మరిచి పోయారు విశ్రాంతి - మాట యిపుడు 6

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి