శనివారం, డిసెంబర్ 31

కార్మికుడు - చదువు

          చదువు మీద శ్రద్ధ  సన్న గిల్లెడు నంత 
      ఆదిలోనె చదువు ఆగి పోవు,
      చదువు, శ్రమను బట్టి చాకిరీ యుంటుంది 
      చాకిరీయు బట్టి రూకలొచ్చు!                               1 
    
      కష్ట పడక పోతె గడవదు ఇల్లంచు 
      కాసు కొస మగును కార్మికుడిగ ; 
      చమట యోడ్చి యంత శ్రమ పడినను గాని 
      చేత నిలువ దెపుడు  చిల్లి గవ్వ !                             2 

      కండ బలము జూపి కార్మికుడానాడు
      ఫాక్టరీల యందు పనికి జేరె;
      బుద్ది బలము నిపుడు వృద్ది చేయక పోతె
      పనిని చేయ సాధ్య పడదు ఇపుడు                          3 

      కాల మిపుడు మారి కంప్యు టార్ లోచ్చేయి
      పాత చదువు లిపుడు పనికి రావు ;
      నాణ్య తొకటె గాదు నవ్యత చూపేటి 
      అవసరాలు నేడు అధిక మయ్యె !                              4 
     
      పాతకాలమందు వాడిన పని ముట్లు 
      పనికి రాక నేడు ప్రక్క బడియె ;
     శక్తి ,యుక్తి జూపి శ్రమి యించ బోకుంటె
     భావి బ్రతుకు మనకు భారమగును !                            5 

      కార్మి కుడియె గాని  కర్ష కుడియె గాని 
      చదువు రాక బోతే చవట యగును ;
     సంఘ గౌరవంబు  చదువర్లకే యుండు 
     సత్వ రమ్ము నీవు చదువు కొనుము !                          6 

      చదువు మాని వేసి చాల కాలం బయ్యె 
      చదువు ఎటుల అనెడి సంశ వద్దు 
      చదువు కొనుట కిపుడు చాల మార్గము లుండె
     మంచి మార్గ మెంచి మనిషి వగుమ !                             7 

      అనుభ వమ్ము మీద అధికార  మొచ్చినా 
      చదువు లేమి నిన్ను సాగ నీదు !
      అనుభ వమ్ము తోడ అక్షరం యుండినా 
      వంగి చేతు రపుడు వంద నాలు !                                 8 

      అవస రాలకు తగ్గట్టు  సవర ణిచ్చి
      నాణ్యతను పెంచి సరకుల నవ్య తకును
      శ్రద్ధ జూపెడి కార్మిక శ్రామికుని కి 
      యాజమాన్యపు సంపూర్ణ యండ యుండు                   9 

       నేర్పు తోడుగా వెనువెంటే  నిర్ణయాలు 
       తీసు కొనియెడి కార్మిక తెగకు విలువ 
        అట్టి విలువ నిచ్చేది  అక్ష రమ్మె
        తక్షణము  వచ్చి నేర్చుకో  అక్ష రాలు !                         10 

        కార్మికు లంతా ఒకటై 
       శ్రామిక విజయమ్ము పట్ల శక్తిన్ జూపీ 
       రమ్యపు వాతావరణము 
       సమ తుల్యత నొందు నటుల సరిదిద్ద వలెన్ !                 11       
   
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి