శనివారం, జనవరి 7

పల్లెటూరు (పద చిత్రం)

మా  అన్నయ్య  శ్రీ పంతుల (లేటు) విశ్వనాధ రావు రచించిన ఈ పల్లెటూరు పదచిత్రాన్ని మీ అందరి కోసం  నా బ్లాగులో  పెడుతున్నా..

శ్రీకారము ప్రారంభము 
శ్రీకరమగు కావ్యమొకటి శీఘ్రము వ్రాయన్ 
ఆకారము రూపొందెను
ప్రాకారము కట్టుమమ్మ పలుకుల రాణీ !

ఉన్నది  ఒక్క యూరది న గోన్నత  ఖ్యాతిని గొన్న యూరు పే 
రెన్నిక గన్న వారలకు ఎందరికో అది జన్మ భూమియున్ 
చిన్నది గ్రామమై జనులు చింతలు సోకని దొడ్డ వారలై 
మిన్నగ సాగు  చుండిరట మేలగు జీవిత కాల వాహినిన్          2 

కలిమిని జాట రారు  దగ గర్వము  జూపరు గల్గి యుండినన్ 
బలమును జూప  రెన్నడును బాద్యత వీడరు స్వార్ధ చింతతో 
కలతలు పెంచ రెంతయును కయ్యము లాడరు చీటి  మాటికిన్ 
పలకరు నింద వాక్యములు  పండిత పామర లెవ్వ రచ్చటన్    3 

పచ్చని పైరు భూములను పాడియు పంట వన్య సంపదల్
వెచ్చని కూడు గూడులును  వేడుక లన్నియు లభ్య మౌటచే
నచ్చిన వృత్తి చేయుట యె నైజము అప్పటి పల్లె వాసికై
మచ్చుకి కూడ లే వచట మత్సర బుద్ధులు మాన హీనతల్      4 

నవ దాన్యంబులు  పండు చుండెడివి అన్యాక్రాంత విద్రోహముల్ 
లవ  లేశంబును లేని రోజు లవి యుల్లాసంబు నిండారగా 
కవితా ధారలు పొంగి పారెడివి తత్కాలంపు సుజ్ఞాపికల్ 
భువిలో నిల్చెను నేడు కూడ కడు సంపూజ్యంబు లాకైతలై      5 

శ్రీ రామాయణ  భారతాది కధలున్  శ్రీ నామ సంకీర్తనల్ 
ధారా ళంబుగ సాగు చుండెడివి తద్ధర్మంపు  సు వ్యాప్తికై
లే రెవ్వారును పొట్ట కూటి కొరకై లేదంచు నానాటనున్
వేరే యూరున చేయి జాపి   పరులన్ వెచ్చంబు లర్ధిం పగా      6 

శ్రవణా నందము గల్గ జేయును సదా సంగీత సంరంభముల్
దివినే  చేరును వేద నాదములు యుత్తేజంపు టుద్భాసత న్ 
కవితల్ నృత్యము శ్రీ కళాది సుధలున్  కామ్యార్ధ సంసిద్దిచే 
అవనిన్ పల్లెటి జీవితంబు యొక నిత్యానంద సద్బావమే        7 

మారెను కాల మెంతయును మాయలు మీరెను గ్రామమందు ఏ
మారిన వారి నెల్లరను మాపిరి ఆర్పిరి దుష్ట నాయకుల్
పోరులు మిన్ను నంటె భువి పుణ్యము పాపపు  భీతి పొయె; ధి 
క్కారము లెక్కు వయ్యెనట  కక్షలు హత్యలు రాజకీయముల్      8 

విడిదికి  చోటు లేక నడి వీధిని జేరిరి కొంత మంది  ఆ 
మడలుగ  దూర మేగినను మంచివి కానరు బావు లెచ్చటన్
కడివెడు  నీరు లేదు తమ కష్టము బాపెడు దిక్కు లేదు యా 
బుడుగులు పల్లె వాసులకు బాధలు పెక్కులు దిక్కులన్నిటన్     9 

లేదొక్కటి బడి యూరున 
రాదొక్కని కైన చదువు   వ్రాయుట కూడా
పేదలకై  ఓట్లున్నవి
వేదములకు పుట్టినింటి విభవము మాసెన్                              10 

నోరున్నది  ప్రెసిడెంటుకు
కారున్నది టౌను పోవ కావలసినచో 
'బారు'న్నది పానమునకు 
చారన్నమె చాల దచటి జనముల కెపుడున్                            11 

ఆడ వారి కచట అభయ మన్నది లేదు 
బయట కొచ్చి చూడ భయము కలుగు 
నిన్న లేరు యూర నేటి 'రేపు 'ల వారు 
నేడు జూడ వారె నేతలైరి                                                        12 

కూలి నాలి చేసి కూటికే చాలక 
పస్తులుండి వారు బాధ పడిన 
పడుచు తనపు హొరు పరువ మ్మె కనిపించు 
మత్తు లోన నున్న మనిషి కెపుడు                                         13 

షాపు లున్నవి రేషను సరకు లిల్లె
బోరు లున్నవి వానిలో నీరు లేదు 
వీధి దీపము లెప్పుడు  వెలగ వచట 
భారతా వని నిజ రూపు పల్లెటూరు                                         14 

రౌడీ మూకలు వచ్చు చుందు రకటా రాత్రిళ్ళు రాకాసులై 
క్రీడా భూమిని చేయు చుంద్రు పురినే కిష్కిందకా వాసులై 
వీడీ వీడని మల్లె మొగ్గ లబ లల్ వేధించి బాధించినా 
రాడే యొక్కడు యడ్డు నిల్చి యడుగన్ రాజ్యంబు ఏమయ్యెనో   15 

ఇంతను వచ్చె  నెన్నికలు  ఎందరి  కొంపలు కాల్చి కూల్చగా  
పొంతన తగ్గి పోయినది పోరులు మీరెను ఓట్ల సందడిన్ 
గంతలు కట్టు కొం ద్రు కద కండ్లకు నేతలు దేశ సేవకై 
స్వాంతన  పొందలేరు మది స్వార్ధము మిక్కిలి పెక్క టిల్లుటన్      16 

వీధికి రెండు కక్ష్యలు గ వీడెను చీలెను గ్రామ మంతయున్ 
భేదము లెక్కు వయ్యె కడు బీదల మధ్యను కూడ వైరమే ; 
వ్యాధులు పెచ్చు రేగె నతి వాదము దాటెను హద్దు లన్నియున్ 
సాధులు సజ్జ నాళి కట శాంతము లెదిక సౌఖ్య ముండునే ?        17 

గోడల కెక్కెను పేరులు 
మేడలపై కెక్కి నిల్చె మేలుగ జండాల్; 
లీడరు లొచ్చిరి సభలకు 
పాడినదే పాత పాట పాడగ మరలన్ !                                       18 

పార్టీ మారిన వారికి 
హార్టీగా స్వాగతంబు  లధికము లగుటన్ 
ఆర్టీసీ  బస్సుల వలె 
పార్టీలను మార్చ వచ్చు భారత భూమిన్ !                                 19 

పండగల్ జరిపించి పబ్బముల్  జే పట్టు 
                        నొక చోట యొక పార్టి  యొక్క నాడు 
దండి మార్చిలు చూపి   ధారణాల్ జరిపించి 
                        వేరొక్క రొక చోట పేరు గాంచు 
ఎన్నిక లొచ్చిన అన్ని వేళల యందు 
                        సన్నా హముల్  మించు సంబరాలు 
సర్పంచి  ఆ యూరి సర్వాది కారిగా 
                         విలసిల్లి వెల్గొందు వేల్పు యగును 
      పదవి నొక మారు  రుచి జూచి వదల లేడు
      నోట్లు వెచ్చించి  హెచ్చుగా  ఓట్లు కొనును 
      గెలిచి సాధించి పదవికి  కీలు మడచి 
     మంత్రి పదవిని పొందగా మధన పదును                                    21 

బలము జూపెద రటు పైని భక్తి జూపి 
కులము పేరిట ఒతులు కోరు చుంద్రు
గెలుపు ముఖ్యము ఎన్నికన్ గెలిచినంత 
ఏమి చేయుదు రన్నది ఎవరి కెరుక ?                                             22 

ముసలి వారి మాట  ముదితల గోలయు 
అసలు వినరు నేటి  అచట యువత 
కుక్క తోక పట్టి గొదావ రీదుటన్
విలువ సడలి ఓటు విఫల మయ్యె!                                                23 

గెలిచిరి ఓట్ల యుద్ధమున గెల్చియు ద్రోహము చేయు నీచులే 
గెలుతురు  రాజకీయముల కీడును పెంచెడి కీచ కాధముల్ 
కలతలు తీర వెంతయును కమ్మని యూహల  గాలి మేడలే 
పొలతుల దు :ఖ  భారమిక పోయెడి  భాగ్యము లేదు  భారతిన్         24 

తిమ్మిని బమ్మి చేతుమని తీయని మాటలు చెప్పు నేతలే 
సొమ్ములు దాచి యుంచెదరు సోకులు చేసిడి కోర్కె మీరుటన్
ఇమ్ముగ దేశ సంపదలు  నెంతయు పెచ్చుగ ఖర్చు చేయుచున్ 
గమ్మున పోయి వచ్చెదరు ఖండము లావలి దేశ దేశముల్ !           25 

తల్లీ  భారతి నీవె దిక్కు యికపై ధర్మంబు కాపాడి ఈ 
కల్లోలంబును రూపు మాపుటకు హే కారుణ్య చిద్రూపిణీ
పల్లెన్ మీరెను దుష్ట కృత్యములు  తద్భారంపు టాధిక్యతన్
ఎల్లల్ దాటెను రోదనాది క్రమముల్ ఏ తీరు రక్షిం చెదో !                    26 

నిజాము చెప్పు మబద్ధపు నీడ యందు 
మృతిని  దాటించు శక్తి యమృతము నిమ్ము 
వెలుగు నింపుము జీకట్లు దొలగ జేసి 
భారతావని పల్లెల భాగ్య లక్ష్మి !                                                  27 

అమ్మా! రాజిత వేద వాణి వరదా అత్యంత సంభావితా 
రమ్మా నన్నిల గాచి బ్రోచుటకునై రారాజ సంపూజితా 
సమ్మో దమ్మును గోరి చేసితిని ఈ ఝూంకార నాదమ్ము గై 
కొమ్మా! మానిని శారదాంబ శుభదా క్రొంబువ్వు నా కావ్య మౌ  !        28 

ఉపసంహారం     ( పంచ చామరం) :
విరోధ రాజకీయ మెంతో విస్తరించి యుండుటన్ 
కరాళ నాట్య మాడు చుండు కక్షలన్ని పల్లెలన్ 
పరాకు  హెచ్చరించ  గోరి " పల్లెటూరు '  వ్రాసితిన్ 
చిరాకు చెంద  కుండ మమ్ము చిత్త గించ వేడెదన్ !                  29 

అంకితం :
 సంతత దైవ నామ జప సత్కృత కర్ముడు  సాధు శీలి మా 
పంతుల వంశ శేఖరుడు ప్రాజ్ఞుడు మత్పిత జోగాయాన్వ యుం
దంతటి గౌర వోన్నతుని కంకిత మీ కృతి భక్తి  వృ త్తినిన్ 
ఇంతకు మించి నట్టి దిల నేమిటి యున్నది  వాని కీయగన్!        30 

ఈ పదచిత్రాన్ని గూర్చి కొందరి పెద్దల మనోభావాలు::

శ్రీ  ముసునూరు రఘు వర్మ , లెక్చరర్ , రాజా కాలేజి , బొబ్బిలి: 
" ఈ లఘుకృతి సహజ సుందరమైన నాటి పల్లెటూళ్ళ స్థితికి అడ్డం పట్టి నట్లున్నది . నేడు కుళ్ళు రాజ కీయలతో ,ము ఠా తత్వాలతో , కారుడు గట్టిన స్వార్ధంతో ఈర్ష్యా ద్వేషాలతో కుళ్ళు కుల తత్వంతో మానవత్వం మంట కలసిన పల్లెటూళ్ళ స్థితి '  చక్క గా  వ్రాయబడింది 


డా !!  ఆచార్య భావన : అద్యక్షుడు , విజయ భావన , విజయనగరం :
 దేశ ప్రగతికి పల్లెటూరులే పట్టు గోమ్మలని  గాంధీ మహాత్ముడు దేనాడో  అభిప్రాయ పడినాడు . పూర్వపు పల్లెటూర్ల పరిస్థితి ప్రస్తుతం లేదు . ఈ బేధాన్ని శ్రీ విశ్వనాధ రావు గారు సహజ సుందరంగా, ఛందో బద్దంగా వించేరు
 
                                              






   


 
 
   

 



 







1 కామెంట్‌:

  1. విశ్వనాధ రావు మాకు విశ్శి బాబు. చాలా చక్కని రచయిత, కవి, భావుకుడు. అతని పద్యాలు కాల గర్భంలో కలసి పోకుండా ఇలా భద్రం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. అక్షర దోషాలు కనిపిస్తున్నాయి. వచనంలో సరే కానీ , ఛందో రచనలలో అక్షర దోషాలు కనిపంచడం ఇబ్బందికరం. గమనించ గలరు.

    మీ మురళీ మోహనం ముగ్ధ మోహనంగా ఉంటోంది.

    రిప్లయితొలగించండి